
సోమిరెడ్డికి ఎమ్మెల్సీ దక్కేనా?
గవర్నర్ కోటాలో ఇస్తారనే ఆశాభావం
పదవి ఇచ్చి నెల్లూరులో పట్టు సాధించే దిశగా బాబు అడుగులు
నెల్లూరు: తెలుగుదేశంలో ఎమ్మెల్సీ పదవుల రగడ ప్రారంభమైంది. ఈ రేసులో గత ఎన్నికల్లో ఓటమి పాలైన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆది నుంచి పార్టీ జెండా మోస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఎందుకివ్వరని ఆయన సహచరులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు పోరాటం చేయడానికి సిద్ధపడుతామని వారు హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్సీ కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి ప్రాబల్యం తగ్గించేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు ఆయన సహచరులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనకు గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌కు బదులుగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని కేటాయించినట్లు చెబుతున్నారు. నెల్లూరు రూరల్‌లో అయితే సోమిరెడ్డి సునాయాసంగా గెలిచే వారని, అయితే ఆ స్థానాన్ని పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీకి కేటాయించారని ఆరోపణలు చేస్తున్నారు.
అయితే సోమిరెడ్డి మాత్రం తనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనే ఆశతో ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తనపై సదభిప్రాయం ఉందని గవర్నర్ కోటాలో లేదా పార్టీ కోటాలో కాని తనకు ఎమ్మెల్సీ దక్కుతుందనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. తనలాంటి సీనియర్ నేతలైన గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్, బాబూ రాజేంద్రప్రసాద్ లాంటి వారికి వారి జిల్లాల్లో అవకాశం రావడంతో పదవులు కల్పిస్తున్నారని, అదే తరహాలో సమయం వచ్చినపుడు తనకు కూడా చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే పార్టీ నేతలు మాత్రం సోమిరెడ్డికి ఎమ్మెల్సీ దక్కే అవకాశం లేదని అంటున్నారు. గత ఎన్నికల్లో ఆయన పార్టీ నాయకులను సమన్వయం చేసుకుని పని చేయ లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు దృష్టి నెల్లూరు జిల్లా మీద పడ్డట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ప్రాతినిధ్యం పెంచుకోవడానికి ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకునే యత్నంలో ఉన్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వాకాటి నారాయణరెడ్డి లాంటి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలపై తెలుగుదేశం కన్నేసినట్లు తెలిసింది.
ఇటీవల మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడి పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మరో కాంగ్రెస్ నాయకుడు చాట్ల నరసింహారావు సోమవారం తెలుగుదేశంలో చేరారు. నెల్లూరు జిల్లాలో కోల్పోయిన పార్టీ పట్టును పునరుద్ధరించుకునేందుకు సోమిరెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో ప్రతిపక్షపార్టీల మాటలకు తూటాలు పేల్చగల నాయకుడు సోమిరెడ్డి ఒక్కరే ఉన్నారని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. చంద్రబాబు వ్యూహరచనలో భాగంగా, మంత్రిగా ఉన్న నారాయణకు గుంటూరు నుంచి అవకాశం కల్పించి, సోమిరెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.