సోనియా పిచ్చిది.. ఆమె చేతిలో రాయి ఉంది: జేసీ
సాక్షి, హైదరాబాద్: ‘‘సోనియాగాంధీ పిచ్చిది. ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండటం మా ఖర్మ. ఆమె చేతిలో రాయి ఉన్నపుడు ఏ వైపైనా విసురుతుంది’’ అని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి విమర్శించారు. ఆమె చేతిలో రాయిని పీకేసే వరకూ సీమాంధ్ర ప్రజలు రాజధాని కోసం గొడవకు దిగొద్దని తాను మనవి చేస్తున్నానన్నారు. శనివారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు ఎలాంటి ఆందోళన చేసినా అది స్థానికులకే నష్టం తప్ప ఢిల్లీలో ఉన్న పెద్దలకు చీమ కుట్టినట్టయినా ఉండదన్నారు. సోనియా చేతిలో ఉన్న రాయి ఎటు విసిరితే అటువైపువారికి దెబ్బ తగులుతుందని, చచ్చినట్లు నోర్మూసుకుని పడి ఉండాల్సిందేనని చెప్పారు. వాళ్లకు అనంతపురం ఎక్కడో, ఏలూరు ఎక్కడో కూడా తెలియదన్నారు.
ఆంధ్ర, రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదు గాక రాదని, ఈ మాట తాను ఆరు నెలల కిందటే చెప్పానని అన్నారు. తమిళనాడులో మాదిరిగా ఇక ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీల యుగమేనన్నారు. కాంగ్రెస్‌లో ఉండి పటిష్టం చేస్తామని అనంతపురం జిల్లా మంత్రి రఘువీరారెడ్డి చేసిన ప్రకటనపై జేసీ పేరు ప్రస్తావించకుండా స్పందిస్తూ ‘ఆయనకు అంత పెద్ద గుండెకాయ ఉంది.. మాకు చిన్నదే ఉంది’ అని వ్యంగంగా అన్నారు.