'రాయల తెలంగాణతో విభజన సమతూకం'
హైదరాబాద్ : రాయల తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అంగీకరించారని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదన సంతోషకరమన్నారు. రాయల తెలంగాణ అంశంలో కరుణించిన సోనియాకు.... సహకరించిన సీమాంధ్ర కేంద్రమంత్రులకు జేసీ ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. రాయల తెలంగాణతో రాష్ట్ర విభజన సమతూకంగా ఉంటుందని అన్నారు.
తెలంగాణలో రాజకీయ అస్థిరతను నివారించడానికి కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపడం ఉపయోగకరమని జేసీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బళ్లారి కలిసినప్పుడే రాయలసీమ విడిపోయిందని ఆయన అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలు గతంలో నిజాం పాలనలో ఉండేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కత్తులు, కటార్ల సంస్కృతి కర్నూలు...అనంతపురం జిల్లాల నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాలకు తరలిందని జేసీ వ్యాఖ్యానించారు.
రాయల తెలంగాణకు అభ్యంతరం లేదని తనతో చెప్పిన తెలంగాణ ప్రాంత నేతలు బాహాటంగా అంగీకరించకపోవటం దురదృష్టకరమని ఆయన అన్నారు. కాగా ఈ సందర్భంగా అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ .... రాయల తెలంగాణ కాదని... రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరండని జేసీకి సూచించారు.