
ఏం చేద్దాం? ఎలా చేద్దాం?! :నాదెండ్లమనోహర్
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి చేరడంతో తదుపరి చర్యలపై స్పీకర్ నాదెండ్లమనోహర్ తీవ్ర తర్జనభర్జనలు సాగిస్తున్నారు.
విభజన బిల్లుపై స్పీకర్ నాదెండ్ల ఎడతెరపిలేని మంతనాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి చేరడంతో తదుపరి చర్యలపై స్పీకర్ నాదెండ్లమనోహర్ తీవ్ర తర్జనభర్జనలు సాగిస్తున్నారు. అసెంబ్లీలో దీనిపై చర్చను ఏరీతి న చేపట్టాలో న్యాయనిపుణులు, రాజ్యాంగ కోవిదులతో సంప్రదింపులు ప్రారంభించారు. శాసనసభకు బిల్లు ప్రతులు రాకముందునుంచే ఆయన దీనిపై ఆయా వర్గాలకు చెందిన ముఖ్యులతో మంతనాలు ప్రారంభించినా.. శుక్రవారం ప్రభుత్వం నుంచి అధికారికంగా బిల్లు తనకు చేరడంతో శనివారం దీనిపైనే దృష్టి పెట్టారు. బిల్లును సభలో ఎలా చర్చకు చేపట్టాలి? సభలో తలెత్తే పరిస్థితులు ఎలా ఉండబోతాయి? తాను ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉం టుందన్న అంశాలపై రాజ్యాంగ నిబంధనలు, అసెంబ్లీ విధివిధానాలను పరిశీలించారు. విభజన బిల్లుపై శాసనసభ్యులు రెండుగా చీలిన తరుణంలో అసెంబ్లీలో దీనిపై చర్చ కత్తిమీద సామేనన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాలను అనుసరించి మెజార్టీ సభ్యుల సూచనల మేరకు సభలో బిల్లును చర్చకు చేపట్టాల్సి ఉంటుందని స్పీకర్ అభిప్రాయపడుతున్నారు.
అంతుచిక్కని సర్కారు వైఖరి
తెలంగాణ బిల్లుపై చర్చ విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుందన్నది అంతుచిక్కడంలేదు. ఈ విషయంలో అసెంబ్లీ వర్గాలకు, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య సమన్వయం లేమి స్పష్టంగా కనిపిస్తోంది. సభలో కీలకాంశాలపై చర్చకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయాన్ని అనుసరించే కార్యకలాపాలు దాదాపుగా ఖరారవుతుంటాయని, కానీ విభజన బిల్లు కావడంతో ఆయా పార్టీలనుంచి వచ్చే అభిప్రాయాలను అనుసరించి నడవాల్సి ఉంటుందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత శాసనసభ సమావేశాలను ఏడు రోజులపాటు నిర్వహించాలని సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) లో నిర్ణయించారు. అందులో 7 రోజుల పని దినాలని తెలంగాణ నేతలు చెబుతుండగా మొత్తంగా 7 రోజులని, ఆ లెక్కన మరో 5 రోజులే పనిదినాలుంటాయని ఈ నెల 20తో సమావేశాలు ముగుస్తాయని అసెంబ్లీ వర్గాలు చెప్పాయి. కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 175 (2) ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ నుంచి ఏదైనా బిల్లు లేదా సందేశం వచ్చినప్పుడు దాన్ని యథాతథంగా సభ ముందు పెట్టాల్సి ఉంటుందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం విభజన బిల్లు ‘రహస్యం’ (కాన్ఫిడెన్షియల్) అని పేర్కొన్నందున దాన్ని సభ ముందు పెట్టేంతవరకు ఎలాంటి మార్పుచేర్పులు, త ర్జుమాలు చేయడానికి వీలులేదు. ఒకసారి సభ ముందు పెట్టిన తర్వాతే అది పబ్లిక్ డాక్యుమెంట్‌గా పరిగణించాలి. సభ ముందుంచిన తర్వాత సభ్యుల అభిప్రాయం మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు ఆంగ్లంలో ఉండగా, తెలుగు, ఉర్దూలో తర్జుమా కావాలని సభ్యులు కోరినా దానిపై స్పీకర్ మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలగుతారు.
విపక్షాలను ఒప్పించాల్సిన బాధ్యత సీఎందే
సభలో చర్చను ఎప్పుడు చేపట్టించాలన్న అంశంపై ప్రభుత్వానికి నిర్దిష్టంగా ఏమైనా అభిప్రాయాలు ఉంటే వాటికి అనుకూలంగా ఇతర పక్షాలను ఒప్పిం చుకోవాల్సిన బాధ్యత సభా నాయకుడిగా సీఎం కిరణ్‌పైనే ఉంటుందని అసెంబ్లీ వర్గాలంటున్నాయి. ఇప్పటివరకు సీఎం నుంచి కానీ ప్రభుత్వంలోని ఇతర ప్రముఖులు కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేపట్టలేదు. ఇతర విపక్షాల మాట అటుంచి ప్రభుత్వంలోనే దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. బీఏసీలోని తెలంగాణ మంత్రులు తక్షణమే చర్చకు చేపట్టాలని డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో సీఎం ఉద్దేశం ఏమేరకు నెరవేరుతుందో అనుమానమేనంటున్నారు. బీఏసీలో ఎక్కువమంది సభ్యులనుంచి వచ్చే అభిప్రాయాలను అనుసరించి తాను నడచుకోవాలని స్పీకర్ భావిస్తున్నారు.
బిల్లుపై చర్చ ఎప్పుడు, ఎన్ని రోజులు చేపట్టాలి? పార్టీల వారీగా ఎంత సమయం కేటాయించాలి? అనే అంశాలపై సభ్యులను అడిగి తెలుసుకొని మెజార్టీ సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటారని స్పీకర్ సన్నిహిత వర్గాలంటున్నాయి. వాటితో పాటు గతంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో విభజన బిల్లులపై ఆయా శాసనసభల్లో చర్చ జరిగిన తీరును, అనుసరించిన విధానాలను కూడా స్పీకర్ పరిశీలిస్తున్నారు. వీటినీ దృష్టిలో పెట్టుకొని చర్చపై ఆయన తుది నిర్ణయం తీసుకోవచ్చని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.
‘‘రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు కనుక దీనిపై జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. స్పీకర్ స్థానంపై ఎలాంటి విమర్శలూ ఉండకుండా చూసుకోవాలి. బిల్లుపై అభిప్రాయాలు తెలుసుకొని రాష్ర్టపతికి పంపడమే సభాపతి విధి. సభ అభిప్రాయం ఎలా ఉన్నా, బిల్లుపై చర్చ సాగకున్నా, చివరకు ఆ బిల్లు తనకు చేరకపోయినా రాష్ట్రపతి దాన్ని శాసనసభ చర్చించినట్లుగానే భావించి కేంద్రానికి పంపిస్తారు. ఈ తరుణంలో బిల్లును సభలో ప్రవేశపెట్టడం, చర్చను సాఫీగా ముందుకు తీసుకువెళ్లడమన్నదే కీలకం. ఇదే విషయం బీఏసీలో కూడా స్పీకర్ స్పష్టంచేయనున్నారు’’అని అసెంబ్లీ వర్గాలు వివరించాయి.