
ప్రత్యేక బంద్ సంపూర్ణం
♦ వేకువనే బస్టాండ్‌లో బైఠాయించిన ఎంపీ మేకపాటి
♦ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
♦ అపాచి, నిప్పో పరిశ్రమలను మూయించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
♦ జాతీయరహదారిపై బైఠాయించిన ఎమ్మెల్యేలు, ప్రసన్న
♦ ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయిన వైనం
♦ స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, దుకాణాలు మూసివేత
♦ ముందురోజు సెలవులు ప్రకటించిన వ్యాపారస్తులు
♦ ఏడుగురు ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన పోలీసులు
♦ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేసిన ఎమ్మెల్యే పాశం
♦ మద్దతు పలికిన సీపీఎం, సీపీఐ, విద్యార్థి సంఘాలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రత్యేక బంద్‌కు వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి, వ్యాపార, వాణిజ్యసంఘాలు మద్దతు తెలియజేశాయి. బంద్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు అన్నివర్గాల వారు పూర్తి మద్దతు తెలియజేశారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వేకువజామునే ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని అక్కడే బైఠాయించి ధర్నా చేశారు.
అనంతరం నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్, కేవీఆర్ పెట్రోల్‌బంక్ వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. వెంకటగిరిలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావుల ఆధ్వర్యంలో కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో వెయ్యి బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. విజయహల్ గేటు నుంచి ముత్తుకూరు, మద్రాస్ బస్టాండ్, వీఆర్సీ, గాంధీబొమ్మ, కనకమహల్, స్టోన్‌హౌస్‌పేట, నవాబుపేట, రంగనాయకులపేట, చిన్న, పెద్దబజారు, బారకాసు, జడ్పీసెంటర్ మీదుగా బైక్‌ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేకహోదా నినాదాలతో హోరెత్తించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని 22 ప్రాంతాల్లో కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి ధర్నాలు నిర్వహించారు. గూడూరులో ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ వేకువజామున బస్టాండ్‌కు చేరుకుని బస్సులను ఆడ్డుకున్నారు. అనంతరం టవర్‌క్లాక్ కూడలి నుంచి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించి పలు ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేయటంతో స్టేషన్‌ముందు బైఠాయించారు.
జాతీయరహదారులు దిగ్బంధం
కోవూరు నియోజకవర్గ పరిధిలో ప్రసన్నకుమార్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలతో జాతీయరహదారిపై బైఠాయించారు. ఆత్మకూరులో ఎమ్మెల్యే గౌతంరెడ్డి ముంబై-నెల్లూరు రహదారి, ఆత్మకూ రు బస్టాండ్, సోమశిలరోడ్డు సెంటర్‌లో నాయకు లు, కార్యకర్తలతో కలసి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి వెంకటాచలం వద్ద హైవేపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్‌కుమారెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు.
సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య షార్‌కు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. అపాచి, నిప్పో వంటి పెద్దపెద్ద పరిశ్రమలను సైతం మూయించారు. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బంద్‌లో బస్సులను అడ్డుకున్నందుకు పోలీసులు ఏడుగురు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి సొంతపూచీకత్తుపై విడిచిపెట్టారు. ప్రత్యేక హోదా కోసం చేపట్టిన బంద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ విజయవంతమైంది.
ఆర్టీసీకి రూ.33 లక్షలు నష్టం
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్ సందర్భంగా ఆర్టీసీకి రూ.33 లక్షలు నష్టం వాటిల్లిందని అధికారులు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పది బస్ డిపోల నుంచి వాహనాలు ఆగిపోయిన కారణంగా ఈ నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.