క్లాసులో ఎప్పుడూ ముందుంటే సాయిరాం ఈమధ్య ముభావంగా ఉండడం.. ఇంట్లో పనివాళ్లను హేళనగా మాట్లాడడం.. పెద్దలంటే లెక్కచేయకపోవడం.. చిన్నవయసులోనే మొబైల్ ఫోన్లలో కాలక్షేపం చేయడం.. క్లాసులో ఒక వర్గం వారితోనే స్నేహం చేయడం లాంటివి సాయిరాం తల్లిదండ్రులు గమనించి నిపుణుల వద్దకు కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు.. పరీక్షించి వారు చెప్పిన సమాధానం విని వారికి మతిపోయింది.. స్మార్ట్ క్లాసులు, డిజిటల్ క్లాసులు, ఒలింపియాడులు, డిజిటల్ పాఠాలు అంటూ చిన్నారులపై మోపుతున్న భారానికి వారిలో గ్రాహ్యశక్తి నశించి బట్టీపెట్టుకుంటేనే గుర్తుండే స్థాయికి దిగజారిపోయారని, చెప్పేవారు ఎవరూ లేక ఏది మంచి ఏది చెడు, ఏది చెయ్యాలి.. ఏది చెయ్యకూడదు తదితర విషయాలను కూడా పక్కన పెట్టి, తాము ఏం చేయదల్చుకున్నారో దాన్ని చేసేందుకు సిద్ధపడతారని, ఈక్రమంలో సరిగా జాగ్రత్తలు తీసుకోకుంటే మానవతా విలువలు సైతం వదిలేస్తారని చెప్పడంతో తల్లిదండ్రులకు తమ కాళ్ల కింద భూమి కంపించినట్లయింది..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆటపాటలతో విద్యాభ్యాసం చిన్నారులకు మానసికోల్లాసాన్ని కలిగిస్తుంది. గురువు బోధన చేస్తే శోధించి సాధించే మనస్తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే విద్యార్థి పరిపూర్ణవంతుడుగా ఎదుగుతాడు. పరిశోధనాత్మకంగా ఆలోచిస్తూ దేనినైనా సాధించాలనే గుణాలను కలిగి వుంటారు. కానీ నేడు ఆటపాటలకు దూరమై, ఆధునిక టెక్నాలజీతో విద్యార్థులు సిలబస్‌నే బట్టి పడుతూ జిరాక్స్ మిషన్‌లు,.. రోబోల్లాగా మారుతున్నారనేది విద్యావేత్తల ఆందోళన. స్మార్ట్‌క్లాస్‌లు, డిజిటల్ క్లాస్‌లు, ఆన్‌లైన్ పాఠాలు వుండాల్సిందేనని, కానీ అవి పరిమిత అవర్స్ మాత్రమే వుండాలని నిపుణులు అంటున్నారు. ఈ రకమైన బోధనతో గురువుతో ప్రత్యక్ష సంబంధాలు కోల్పోతున్నారని నిపుణులు అంటున్నారు. నేటి విద్యార్థులు మెమరీ ఎక్కువుగా వుంటున్నా. ఇంటిలిజెన్స్ తక్కువుగా వుంటుందని చెబుతున్నారు.
మానవ సంబంధాలకు పాతర..
విలువలనేవి నేర్చుకుంటే వచ్చేవి కావు. గురువులు, తల్లిదండ్రుల ద్వారా సమాజ స్థితిగతులను తెలుసుకుని విలువలను పెంపొందించుకోవాలి. ప్రస్తుతం తల్లిదండ్రులు బిజీ లైఫ్‌తో పిల్లలతో గడిపే సమయం కూడా వుండటం లేదు. దీంతో స్కూల్‌లో స్మార్ట్ క్లాసులు, ఇంటికి వచ్చిన తర్వాత ఆన్‌లైన్ పాఠ్యాంశాలతో పిల్లలు గడిపేస్తూ, ఆట పాటలకు దూరమవుతున్నారు. దీంతో వారిలో ఒక రకమైన మైండ్‌సెట్ ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.ఎప్పుడూ కంప్యూటర్, పాఠాలు, ఫేస్‌బుక్‌లతో వారిలో విభిన్నమైన మనస్తత్వం ఏర్పడుతుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషి ఎప్పుడు సంఘాన్ని చూసి నేర్చుకోవాలని, ప్రస్తుతం తరం విలువలు, మాన వ సంబంధాలు కోల్పోతున్నారని చెపుతున్నారు.
చిన్న సమస్యనూ పరిష్కరించుకోలేరు
నిత్యం కంప్యూటర్, ఆన్‌లైన్ పాఠాలు, పర్యవేక్షణతో బలవంతపు చదువులతో తీవ్రఒత్తిడికి గురవుతున్న చిన్నారులు చిన్న సమస్య ఎదురైనా పరిష్కరించుకోలేరు. అలాంటి సమయంలో సమస్య నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు చెపుతున్నారు. విద్యా విధానంలో మార్పు రానంత కాలం ఇవి కొనసాగుతూనే ఉంటాయనేది నిపుణులు వాదన. జీవితంలో ఎదురయ్యే అతిసాధారణ సమస్యను సాధించడానికి కావాల్సిన మానసిక శక్తి ప్రస్తుత విద్యార్థుల్లో వృద్ధి చెందడం లేదు. ప్రస్తుత విద్యావిధానంతో జీవన విధానాన్ని నేర్పే పద్ధతులను కోల్పోతున్నారు.
స్వీయ ఆలోచన కోల్పోతున్నారు
నేటివిద్యా విధానం ద్వారా విద్యార్థులు స్వీయ ఆలోచనను కోల్పోతున్నారు. ఎంతవరకూ పాఠ్యాంశాలను బట్టిపడుతూ జిరాక్స్ మిషన్‌లాగా ఎదుగుతున్నారు. వారిలో రీసెర్చ్ మైండ్ డెవలప్ కావడం లేదు. ర్యాంకులు, మార్కులు సా«ధించడం మినహా ఊహాజనిత సమస్యలను సాధన చేయడంలేదు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోగలిగే ఆత్మస్థైర్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి. నిత్యం కంప్యూటర్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకు అలవాటు పడుతూ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. అలాంటి వారిలో కోపం, చిరాకు ఎక్కువుగా వుంటుంది. నేను అనే భావన వారిలో వుంటుంది. దీంతో సోదరుల్ని సైతం బయటివారిలా భావిస్తూ వ్యవహరిస్తుంటారు. నిత్యం పాఠ్యాంశాలను బట్టీపట్టడం ద్వారా చెప్పింది చేసే రోబోల్లా మారుతున్నారు. ఈ విధానం మారాలి.
– డాక్టర్ టీఎస్‌రావు, సైకాలజిస్ట్, రాష్ట్రప్రభుత్వ ఎడ్యుకేషన్ ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment