ఎస్పీవై రెడ్డి దూరం!
నంద్యాల, న్యూస్‌లైన్: స్థానికంగా జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశానికి నంద్యాల ఎంపీ ఎస్పీవెరైడ్డే దూరంగా ఉన్నారా.. లేక పార్టీ నాయకులే ఆయనను ఆహ్వానించలేదా.. అనే చర్చ జరుగుతుంది. నంద్యాల అసెంబ్లీకి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూసిన మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి అందుకు గల కారణాలను విశ్లేషిస్తూ మంగళవారం నంద్యాల పట్టణంలోని మార్కెట్‌యార్డులో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నంద్యాల పట్టణంతో పాటు గోస్పాడు, నంద్యాల మండలాలకు చెందిన కార్యకర్తలందరినీ ఆహ్వానించారు.
అయితే, వైఎస్సార్సీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవెరైడ్డి విజయం సాధించి ఆ తర్వాత ఆ పార్టీకి దూరమై చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల ఆయన చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంతో పాటు మహానాడుకు కూడా హాజరయ్యారు. అయితే, అత్యంత కీలకమైన నంద్యాల పట్టణంలో జరిగిన సమావేశానికి ఎస్పీవెరైడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశం నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌లు ఎస్పీవెరైడ్డిని ఆహ్వానించలేదని పార్టీ వర్గాలు గుసగుస లాడుకుంటున్నాయి.
అయితే, ఆయనే సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు ఎస్పీవెరైడ్డి వర్గీయులు పేర్కొంటున్నారు. గైర్హాజరుకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ఆయన రాకను మాత్రం శిల్పా, ఫరూక్‌లు జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రస్తుత టీడీపీ సమావేశం జరిగిన మార్కెట్‌యార్డు ఆవరణలోనే శిల్పా ప్రధాన అనుచరుడు సిద్ధం శివరాం మార్కెట్ యార్డు చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు శాసన సభ్యులను, అధికారులను శివరాం ఆహ్వానించలేదు. అప్పట్లో పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నా ఎస్పీవెరైడ్డిని కూడా పిలువలేదు.
ఇందుకు శిల్పా డెరైక్షనే ప్రధాన కారణమని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు జరిగిన సమావేశానికైనా ఎస్పీవెరైడ్డిని ఆహ్వానిస్తారని భావించారు. అయితే, గత ఎన్నికల్లో తమకు నష్టం కలిగించిన వ్యక్తిని సమావేశానికి పిలువడం సబబు కాదని పార్టీ కార్యకర్తలు శిల్పాతో అన్నట్లు తెలుస్తోంది. దీంతో సమావేశంలో ఎస్పీవెరైడ్డి గురించి శిల్పా సానుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ మాట్లాడకుండా వ్యూహాత్మకంగానే వ్యవహరించారని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.
అతని గురించి సానుకూలంగా మాట్లాడకుంటే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో ఇబ్బందులు, మాట్లాడితే కార్యకర్తల నుంచి ఆగ్రహం చవి చూడక తప్పదని భావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద నంద్యాల అసెంబ్లీ వరకు ప్రస్తుతం టీడీపీలో శిల్పా, ఎస్పీవెరైడ్డిల ఆధిపత్యంపై హాట్ టాపిక్ కొనసాగుతున్నదని, చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తాడో చూడాల్సి ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.