టీడీపీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన తర్వాత న్యూఢిల్లీలో మీడియాతో ఎస్పీవైరెడ్డి మాట్లాడుతూ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ తో ఎలాంటి విభేదాలు లేవు అని అన్నారు. అంతేకాక తనకు వైఎస్ జగన్ అంటే అభిమానమని ఆయన అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఎస్పీవైరెడ్డి తెలిపారు. నాప్రాంతం, నియోజకవర్గ అభివృద్ది కోసమే టీడీపీలో చేరానని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. నాకు ఓటు వేసిన ఓటర్లు ఇబ్బంది పడినా.. మెజార్టీ ప్రజలు అభినందిస్తారని ఆయన అన్నారు. టీడీపీ నేత టీజీ వెంకటేశ్ ద్వారా చంద్రబాబును కలిశానని ఆయన అన్నారు. నేను హార్డ్ కోర్ పొలిటిషియన్ కాదు. రాజకీయాలు ప్రవృత్తి మాత్రమే అని ఎస్పీవైరెడ్డి అన్నారు. సాయంత్రంలోగా బుట్టా రేణుక కూడా టీడీపీలో చేరవచ్చని ఆయన చెప్పారు.