సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాను తిత్లీ తుపాను అతలాకుతలం చేసేసి దాదాపు 23 రోజులు గడిచిపోయింది. పంటలు, పాడి, తోటలు, ఇళ్లు, పాకలు ఇదీ అదీ అని కాదు ఆ బీభత్సానికి ప్రజలు సర్వం కోల్పోయారు. జీవనాధారం కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో జిల్లా అధికార యంత్రాంగంపై బాధ్యతలు రెట్టింపు అవుతాయి. కుటుంబాలకు సైతం దూరమై రేయింబవళ్లు సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నడిపించడానికి అహర్నిశలు కష్టపడుతున్న వారిలో జిల్లా కలెక్టరుగా కె.ధనంజయరెడ్డి ముందున్నారు. తుపాను, వరద బాధిత ప్రాంతాల్లో చేపట్టిన, చేస్తున్న, చేయబోయే పనుల గురించి శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సాక్షి:తిత్లీ తుపాను, వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులు, ఇతర వర్గాల ప్రజలు సర్వం కోల్పోయారు. వారికి ఉపాధి కూడా కరువైంది. ఈ నేపథ్యంలో మీరు తీసుకుంటున్న చర్యలేమిటి?
కలెక్టరు: తిత్లీ వంటి తుపానైనా, వరదలైనా, లేదంటే కరువైనా రైతులు, కూలీలు పంట నష్టపోవడమే కాదు ఉపాధి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద వంద రోజుల పనిదినాలు ఇప్పటికే కల్పిస్తున్నాం. తిత్లీ తుపాను బాధితులకు తక్షణమే ఉపాధి చూపించే ఉద్దేశంతోనే అదనంగా మరో యాభై పనిదినాలు కల్పిస్తున్నాం. వాస్తవానికి ఈ సీజన్‌లో శ్రీకాకుళం జిల్లాలో కరువు మండలాలు లేవు. తుపాను వల్ల జిల్లా నష్టపోయింది. ఇది కూడా ప్రకృతి విపత్తే కాబట్టి 25 మండలాల్లో ఈ పనిదినాల పెంపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
సాక్షి: జిల్లాలో ఏయే మండలాలను తిత్లీ తుపాను, వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు?
కలెక్టరు: ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, కోటబొమ్మాళి, నందిగాం, సంతబొమ్మాళి, టెక్కలి, జలుమూరు, ఎల్‌ఎన్ పేట, సరుబుజ్జిలి, నరసన్నపేట, పోలాకి, గార, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, సారవకోట, భామిని, మెళియాపుట్టి, వీరఘట్టం, సీతంపేట, పలాస మండలాలను తిత్లీ తుపాను, భారీవర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం 16వ నంబరు జీవోను విడుదల చేసింది.
సాక్షి: తుపానుతో ప్రజలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ ‘ఉపాధి’ సరిపోతుందా?
కలెక్టరు: ఉపాధి హామీ పథకం కింద చేపట్టడానికి తుపాను బాధిత ప్రాంతంలో అనేక పనులు ఉన్నాయి. ఒక్క టెక్కలి రెవెన్యూ డివిజన్‌లోనే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ. 98.8 కోట్లు విలువగల పనులు జరిగాయి. మెటీరియల్ కాంపోనెంట్ పనులు రూ. 32.82 కోట్లు వరకూ చేశారు. ఈ డివిజన్‌లో ఎక్కువ మంది నరేగా పనులపై ఆధారపడినవారు ఉన్నారు. 11,194 శ్రమశక్తి (ఎస్‌ఎస్‌ఎస్) సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 1,56,904 మంది వేతనదారులు ఉన్నారు. వారిలో ప్రతి రోజూ ఉపాధి పనులకు వెళ్లేవారు 1,10,760 మంది ఉన్నారు. ఇప్పుడు అదనంగా 50 పనిదినాలు వచ్చాయి. ఇప్పటివరకు వంద రోజుల పాటు పనిదినాలు చేయని కుటుంబాలు కూడా వచ్చే ఏడాది మార్చిలోగా 150 పనిదినాలు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. తుపాను వల్ల పాడైపోయిన పొలాలు, గట్లు బాగు చేసుకోవడం వంటి పనులు కూడా చేసుకునే వెసులుబాటు ఉంది.
సాక్షి: తిత్లీ తుపానుతో నేలకొరిగిన చెట్లను తొలగించుకోవడానికి రైతులకు ఏవిధమైన సహాయం అందిస్తారు?
కలెక్టరు: కూలిపోయిన అన్ని రకాల చెట్లను తొలగించే బాధ్యత ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖలు తీసుకుంటున్నాయి. అందుకుకావాల్సిన డీజిల్ ఆధారిత రంపాలను సమకూర్చాం. అలాగే ప్రతి చెట్టును జియోట్యాగింగ్ చేసి తొలగించుకోవడానికి రైతులకు మెటీరియల్ కాంపొనెంట్ కింద జీడిమామిడి చెట్టుకు రూ.300, కొబ్బరి చెట్టుకు రూ.240 చొప్పున చెల్లిస్తాం. ఇప్పటికే 60 వేల చెట్లను తొలగించారు. ఇలా రెండు వేల ఎకరాల్లో తొలగింపు పూర్తయ్యింది.
సాక్షి: ఇంకా చాలామంది బాధితులు తమ పేర్లు లేవని, నష్టం నమోదు ప్రక్రియ సరిగా చేయలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు.
కలెక్టరు: నష్టాల గణన సత్వరమే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయడం వల్ల అక్కడక్కడా తప్పులు దొర్లిన మాట వాస్తవమే. బాధితులు ఎవ్వరైనా సరే ఈ విషయంలో దరఖాస్తు చేయవచ్చు. వాస్తవానికి నష్టాల నమోదు ప్రక్రియ శనివారంతో పూర్తయ్యింది. కానీ రానున్న మూడు నాలుగు రోజుల వరకూ వచ్చే ఫిర్యాదులను, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. నిజమైన బాధితులను గుర్తించి న్యాయం చేస్తాం. రెండో దఫా జాబితాలో వారికి నష్టపరిహారం చెల్లిస్తాం.
సాక్షి: బాధితులు కోలుకునేందుకు మీరు చేపట్టనున్న దీర్ఘకాలిక చర్యలు ఏమిటి?
కలెక్టరు: సర్వం కోల్పోయిన బాధితులను సాంఘికంగా, ఆర్థికంగా, ప్రాథమిక వసతులపరంగా దీర్ఘకాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ‘తిత్లీ ఉద్ధానం పునరుద్ధరణ కార్యక్రమం’ (టీయూఆర్‌పీ– తూర్పు) చేపట్టనున్నాం. ఇళ్లు మంజూరు, మొక్కల అందజేత, రాయితీపై విత్తనాలు, ఎరువుల సరఫరా, కావాల్సినవారందరికీ జలసిరి బోర్ల మంజూరు, మూడేళ్ల పాటు మొక్కల నిర్వహణకు నిధులు హెక్టారుకు రూ.40 వేల చొప్పున విడుదల వంటి ప్రతిపాదనలు చేస్తున్నాం. అంతర పంటల వైపు రైతులను ప్రోత్సహించాలనే ఆలోచన ఉంది. అలాగే భవిష్యత్తులో విపత్తులను తప్పించలేం. కానీ తుఫానుల సమయంలో పక్కాఇళ్లు ఉంటే నష్టాన్ని తగ్గించవచ్చు. రేకుల ఇళ్లు, పూరిళ్లు కోల్పోయినవారికి 25వేల పక్కాఇళ్లను ఇవ్వాలని గుర్తించాం. తుపాను బాధితులకు మెరుగైన జీవనోపాధి కల్పించి వారు ఎక్కడికీ వలస పోవాల్సిన పరిస్థితి తలెత్తకుండా చేయాలనేది లక్ష్యం.
సాక్షి: పంటనష్టం నమోదులో అవకతవకల నిరోధానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టరు: మా దృష్టికి వచ్చిన అవకతవకలను మండలస్థాయిలోనే గుర్తించి సరిచేస్తున్నాం. కొన్నిచోట్ల తక్కువ విస్తీర్ణంలో నష్టం జరిగితే ఎక్కువగా రాయించడం, భూములు లేకపోయినా ఉందని నమోదు చేయడం వంటి అక్రమాలన్నీ చాలావరకూ నిరోధించగలిగాం. పొరపాట్లను గుర్తించాం. ఇద్దరు ముగ్గురు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నాం. అందుకే ప్రాథమిక జాబితాకు ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. వరి పంటనష్టం 93వేల హెక్టార్ల నుంచి ఇప్పుడు 76 వేల హెక్టార్లకు తగ్గింది. నష్టపోయిన కొబ్బరి చెట్లు సంఖ్య 14 లక్షల నుంచి దాదాపు 10 లక్షలకు తగ్గిపోయింది. ఏదిఏమైనా బాధితులను ఆదుకోవడానికి అధికార యంత్రాంగం ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసింది. అంతా రేయింబవళ్లు కష్టపడ్డారు. ఎంతో ఒత్తిడి ఉన్నా ప్రజల కోసం కాబట్టి భరించక తప్పదు.
సాక్షి: తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు?
కలెక్టరు: పునరావాస కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాల విషయంలో సాధారణ పరిస్థితి వచ్చింది. ఇక నష్టపరిహారాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. పంటలు, తోటలు, ఇళ్లు, ఇతరత్రా ఆస్తి నష్టాలకు సంబంధించి గణన జరుగుతోంది. నాలుగు లక్షలకు పైగా బాధితులకు ఈనెల 5వ తేదీ నుంచి పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అవి వారి ఖాతాల్లోనే జమ అవుతోంది. దాదాపు రూ.450 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment