దేదీప్యమానం.. దక్షిణకైలాసం
శివరాత్రికి శ్రీకాళహస్తి ముస్తాబు
సర్వాంగసుందరంగా శివాలయం
జంగమయ్య సన్నిధిలో నేడు జనజాగరణ
శ్రీకాళహస్తి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి ఆలయ ఈవో రామిరెడ్డి ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలు, ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులకోసం అదనంగా ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక టికెట్లు కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. 1.5లక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు సర్వం సిద్ధం చేసినట్టు ఈవో రామిరెడ్డి తెలిపారు. దర్శనం తెల్లవారుజామున మూడు గంటల నుంచే ఉంటుందని తెలిపారు. లడ్డూ, వడతో పాటు భక్తులకు అవసరమైన జిలేబి, పులిహోర, పెద్దలడ్డు తదితర ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మంగళవారం ప్రత్యేక దర్శనం కోసం భక్తులు రూ.100 టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంది. లింగోద్భవ దర్శనానికి ప్రత్యేక టికెట్లు లేకుండా రద్దుచేశారు.
భక్తులకు సౌకర్యంగా క్యూలు
మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఈవో చెప్పారు. స్వామి, అమ్మవారిని సులభంగా దర్శించుకుని తిరిగి వెళ్లే విధంగా క్యూలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్యూలోని భక్తులకు మంచినీటి సదుపాయంతోపాటు పాలు, మజ్జిగ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులు వీక్షించేందుకు పలుచోట్ల టీవీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పది వేల మందికిపైగా అన్నప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
అందరికీ లఘు దర్శనమే
మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖమండపం(లఘుదర్శనం) నుంచే స్వామి,అమ్మవార్లను దర్శించుకుని వెళ్లేలా అధికారులు క్యూలు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు గర్భాలయాన్ని ప్రదక్షిణ చేసే అవకాశం లేదు. వీఐపీలను ముఖమండపం తర్వాత అర్థమండపం నుంచి గతంలో స్వామి,అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉండేది. అయితే ఈ ఏడాది ముఖమండపం నుంచే భక్తులందరూ దర్శించుకునేలా క్యూలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈవో రామిరెడ్డ్డి క్యూల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఏపీ సీడ్స్, స్వర్ణముఖినది వద్ద ఏర్పాట్లు జరిగాయి.
ఆలయంలో తనిఖీలు
డీఎస్పీ వెంకటకిషోర్ ఆధ్వర్యంలో భద్రాతా ఏర్పాట్లు చేస్తున్నారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తులను, లగేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆలయంలోకి వెళ్లే నాలుగు ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది హోంగార్డులతో పాటు పోలీసులు కూడా మెటల్ డిటెక్టర్ల వద్ద ఉంటున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద కూడా భక్తులను తనిఖీలు చేస్తున్నారు.
ఆకర్షిస్తున్న శివుని కటౌట్
శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద ఏర్పాటు చేసిన పరమశివుని కటౌట్ అందరినీ ఆకర్షిస్తోంది. భిక్షాల గాలిగోపు రం వద్ద శివలింగం సాలెపురుగు, ఏనుగు, పాములతో కలిసి పరమశివుడు కూర్చుని ఉన్నట్లు చిత్రాన్ని తయా రుచేసిన చిత్రం ఆకట్టుకుంటోంది.సుపథమండపం, శివయ్యగోపురం, తిరుమంజనం,జ్ఞానాంబిక గోపురాలను విద్యుత్ దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. బెంగళూరునుంచి తెప్పించిన వివిధ రకాలపుష్పాలతో కలకత్తా బృందం ఆలయంలో అద్భుతంగా పుష్పాలంకారణ చేసింది. ధ్వజస్తంభాలు,గురుదక్షిణామూర్తి, వెంకటేశ్వరస్వామి,దుర్గాదేవి తదితర పరివార దేవతలను ప్రత్యేకంగా అలంకరించారు.