
ప్రజలు బాధల్లో ఉంటే.. విదేశీ పర్యటనలా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు కరు వు విలయతాండవం చేస్తోంది. హుద్‌హుద్ తుపాను దెబ్బతో కకావికలమైన ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నారు. చంద్రబాబు సర్కారు పుణ్య మా అని చాలా మంది రేషన్‌కార్డులు, పింఛన్లు కోల్పోయి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రజలు ఇన్ని సమస్యల్లో ఉంటే.. సీఎం చంద్రబాబు తన వందిమాగధులు, తాబేదారులతో సింగపూర్‌కు, జపాన్‌కు జాలీ ట్రిప్పులకు వెళ్లడం అవసర మా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను వారి మానాన వారిని వదలి వేసి విదేశీ పర్యటనలకు వెళ్తున్న చంద్రబాబు వైఖరి చూస్తే ‘రోమ్ నగర ం తగులబడుతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. అసలు చంద్రబాబు విదేశీ పర్యటనలపై కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ‘రీసెర్చ్ అనాలసిస్ వింగ్’ (రా)తో పూర్తి స్థాయి లో దర్యాప్తు జరిపించాలని, అపుడు ఆయన బాగోతాలన్నీ బయటపడతాయని శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
జపాన్ పర్యటనకు రూ.1.5 కోట్లా?
పెట్టుబడుల కోసమే జపాన్ వెళుతున్నానని విపరీతంగా మీడియాలో ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు కనీసం తన విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చు మేరకైనా పెట్టుబడులు తేగలరేమో చెప్పాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు కనుక రాజధాని నిర్మాణానికి చందాలివ్వండి అని హుండీలు పెట్టించిన చంద్రబాబు జపాన్ పర్యటనకు అడ్వాన్సు కింద 1.5 కోట్ల రూపాయలు జీవో ద్వారా మంజూరు చేశారన్నారు. సింగపూర్ పర్యటనకు ప్రత్యేక విమానంలో వెళ్లడానికి కూడా కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు.
బాబుకు ఏపీ అద్దె ఇల్లు..
బాబు తీరు చూస్తుంటే సింగపూర్‌నే తన సొం తూరులాగా భావిస్తూ ఏపీని అద్దె ఇల్లు మాదిరి గా అనుకుంటున్నారని శ్రీకాంత్ అన్నారు. గతం లోనూ చంద్రబాబు ఇలాగే విదేశాల్లో పర్యటించి తన నిధులను దాచుకున్నారని, వాటిని మొన్నటి ఎన్నికల్లో వరదలై పారించారన్నారు. ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో వెళ్లారని, బాబు విదేశాల కు వెళ్లేది పెట్టుబడులు దాచుకోవడానికి, మనీ లాండరింగ్‌కు పాల్పడటానికేనని ఆయన ఆరోపించారు. మొత్తం మీద చంద్రబాబు ఏపీలో తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, తానేదో చేస్తున్నట్లుగా ప్రజలకు భ్రమలు కల్పించడానికి మీడియా ద్వారా భారీ హడావుడి చేసుకుంటూ విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు తీరు చూస్తూంటే ఏదో ఒక రోజు రాష్ట్రాన్ని సింగపూర్‌కు తాకట్టు పెడతారేమోనని శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేశారు.