
రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
హుజూర్‌నగర్ :తెలంగాణ రాష్ట్రంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గౌరవిస్తామని ప్రకటించిన చంద్రబాబు రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురి చేసేందుకు పలు వ్యవహారాలను రాద్దాంతం చేస్తున్నాడన్నారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై కూడా అగ్రిమెంట్లు జరిగినప్పటికీ కొత్తగా పీపీఏల వ్యవహారాన్ని తెర మీదకు తెస్తూ రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నాడన్నారు. రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలని ఒకవైపు చెబుతూనే ప్రజల ఆకాంక్షను దెబ్బతీస్తూ ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లోనే నివాసం ఉంటానని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు సహకరిస్తానన్న ఆయన.. తెలంగాణకు విద్యుత్ లేకుండా చేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసేందుకు నాటకాలు ఆడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకునేందుకు ఇక్కడి ప్రజలు ఐక్యంగా ఉన్నారన్నారు.
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలుచేస్తూ జీఓ విడుదల చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో రైతులకు కొత్త రుణాలు ఇప్పించాల్సి ఉన్నందున, సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రజాసంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు వైఎస్సార్‌సీపీ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. ఒకవేళ ప్రజా వ్యతిరేకపాలన సాగిస్తే ప్రజల పక్షాన కొనసాగుతూ ఉద్యమాలు చేపడతామన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, జిల్లా నాయకులు ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, నాయకులు గుర్రం వెంకటరెడ్డి, కస్తాల ముత్తయ్య, కర్నాటి నాగిరెడ్డి పాల్గొన్నారు.