రుణమాఫీ బదులు వర్షాలు మాఫీ
హైదరాబాద్: ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దాలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్తో చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందని విషయం రుజువైందని వ్యాఖ్యానించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసే ధైర్యం చంద్రబాబుకుందా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబు అధికారం చేపట్టి ఈ రోజుకు రెండు నెలలు పూర్తయిందని, ఇంత పనికిమాలిన సీఎంను ఎప్పుడూ చూడలేదని ప్రజలు అనుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఐదు సంతకాలు పెట్టి ఒక్కటి కూడా అమలు చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వమిదని మండిపడ్డారు. రైతుల రుణాలు మాఫీ చేయకుండా వర్షాలు మాఫీ చేసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ముక్కుసూటిగా పనిచేయొద్దని చంద్రబాబు చెప్పడం దారుణమని విమర్శించారు. ఇవే వ్యాఖ్యలు వేరే దేశాల్లో మాట్లాడి ఉంటే కచ్చితంగా జైల్లో పెట్టేవారని అన్నారు. చంద్రబాబు మీరు ఏపీకి ముఖ్యమంత్రా లేక టీడీపీకి ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన పద్దతులు మార్చుకోవాలని, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.