అనకాపల్లిలో పాల ప్యాకెట్ల కోసం తొక్కిసలాట
విశాఖ : విశాఖ జిల్లా అనకాపల్లిలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుఫాను బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాల ప్యాకెట్ల క్యూలైన్ వద్ద తొక్కిసలాట జరిగింది. పాల ప్యాకెట్ల కోసం బాధితులు ఒక్కసారిగా తోసుకు రావటంతో గందరగోళం నెలకొంది.
మరోవైపు పాల ప్యాకెట్ల కోసం జనాలు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడే పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచే జనాలు పాల ప్యాకెట్ల కోసం రోడ్లపై బారులు తీరారు. కాగా పాల ప్యాకెట్ల పంపిణీలో ప్రణాళిక లేని కారణంగా నిజమైన బాధితులకు పాలు అందలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నాలుగు రోజులుగా తుఫాను వల్ల జనానాకి ఏమీ దొరకడంలేదు. కూరగాయలు, పాలు అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో ప్రభుత్వం సాధారణ ధరలకు పాల ప్యాకెట్లు ఇప్పిస్తోందని తెలిసి భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు. కానీ అక్కడ ఏర్పాట్లు తగినంతగా లేకపోవడం, వచ్చిన పాలు అయిపోతాయేమోనన్న ఆందోళన తొక్కిసలాటకు కారణమైంది.