స్టార్ క్రికెట్ మ్యాచ్లో పరుగుల వర్షం
హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం విజయవాడలో జరుగుతున్న సినీతారల క్రికెట్ మ్యాచ్లో పరుగుల వర్షం పోటెత్తుతోంది. టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహిస్తున్న టి-20 మ్యాచ్‌లో టాలీవుడ్ హీరోలు శ్రీకాంత్, తరుణ్ జట్లు పోటీ పడుతున్నాయి.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన శ్రీకాంత్ జట్టు 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసింది. నిఖిల్ 40, నందకిశోర్ 35 పరుగులు చేశారు. తరుణ్ జట్టు లక్ష్యఛేదనలో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ కోసం మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు యువ హీరో రామ్ చరణ్ తేజ్, పలువురు హీరోయిన్లు, కామెడియన్లు, యాంకర్లు వచ్చారు. తమ అభిమాన నటులను చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలివచ్చారు. క్రికెట్ మ్యాచ్తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జట్లు:
తరుణ్ ఎలెవన్ : తరుణ్(కెప్టెన్), నరేష్, నితిన్, ప్రిన్స్, విశ్వా, సందీప్‌కిషన్, రఘు, రాజీవ్‌కనగాల, అయ్యప్ప, సామ్రాట్, అజయ్, శర్వానంద్.
శ్రీకాంత్ ఎలెవన్: శ్రీకాంత్( కెప్టెన్), నాని, నిఖిల్, అదర్శ్, సాయిధర్మతేజ, మనోజ్, నవీన్‌చంద్ర, సుధీర్, నందకిషోర్, ప్రభు, కార్తీక్, ఖయ్యూం, భూపాల్, సమీర్, శశాంక్ .