వామ్మో.. ఆగస్టు!
ఒంగోలు : ఆగస్టు నెల రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఇప్పటికే రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్ వంటి అంశాలు సీఎం చంద్రబాబుకు తలబొప్పి కటిస్తున్నాయి. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇవి చాలవన్నట్టు సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు ఒకటో తేదీన విద్యార్థులు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉద్యమించేందుకు ఆ సంఘ నేతలు సమాయత్తమవుతున్నారు. మరో వైపు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెకు పిలుపునిచ్చారు. రెండో తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఇంకో వైపు ఆర్టీసీలో గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఆందోళన బాట పట్టింది. ఎంప్లాయీస్ యూనియన్ ఈ నెల 2వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. ఇక మాటలు చాలు.. పనులు చేసి చూపండి.. అంటూ పాలకపక్షాన్ని కార్మిక, విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నాయి.
విద్యార్థుల్లో ఆగ్రహం
జిల్లా వ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఐటీఐ వంటి కోర్సులు చదువుకున్న విద్యార్థులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన విద్యార్థులను ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇచ్చేదిలేదంటూ హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విద్యార్థి సంఘాలు శుక్రవారం బంద్ నిర్వహించనున్నాయి.
కార్మికుల హెచ్చరిక
మున్సిపల్ ఉద్యోగులతో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు కూడా ఆందోళనకు దిగుతున్నారు. సమస్యల పరిష్కారానికి సహకరించని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు పిడికిలి బిగిస్తున్నాయి. అందులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నారు. వీరికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అండగా నిలవనుంది.
ఆర్టీసీ బస్సులకు బ్రేకులు
ఆర్టీసీలో గుర్తింపు పొందిన ఎంప్లాయీస్ యూనియన్ ఆగస్టు 2వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు సమాయత్తమవుతోంది. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏటా జూన్ వస్తుందంటే కార్మికులు సీసీఎస్ వైపు దృష్టిసారిస్తారు. సీసీఎస్‌కు సంబంధించి కార్మికులకు కొన్ని అభ్యంతరాలున్నాయి. యాజమాన్యంతో యూనియన్ నాయకులు చర్చలు జరిపినా ఉపయోగం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో జూలై 30వ తేదీ నుంచి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీ రావులు ఆయా ప్రాంతాల్లో నిరవధిక దీక్షకు పూనుకున్నారు.