సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్యం బాసర ఐఐఐటీలోని ఏపీ విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపకార వేతనాల చెల్లింపులో ప్రభుత్వ వైఫల్యం వల్ల 2,000 మంది పేద విద్యార్థుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 2014లో రాష్ట్ర విభజనతో బాసర ఐఐఐటీ తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు ఇడుపులపాయ, నూజివీడు, బాసర ఐఐఐటీ క్యాంపస్‌ల్లో చేరుతున్నారు.
బాసర క్యాంపస్‌లో దాదాపు 6,000 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో దాదాపు 2,000 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. ఏ రాష్ట్రం విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఉపకార వేతనాలు చెల్లించాలి. ఉపకార వేతనాలు రాని విద్యార్థులు మొదటి రెండేళ్లు రూ.36,000 చొప్పున, తరువాత నాలుగేళ్లు రూ.40,000 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏపీలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ ఐఐఐటీల్లోని తెలంగాణ విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలను క్రమం తప్పకుండా చెల్లిస్తోంది.
కానీ, బాసర ఐఐఐటీలోని తమ రాష్ట్ర విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం 2016 నుంచి ఉపకార వేతనాలు చెల్లించడం లేదు. 2016–17, 2017–18 విద్యా సంవత్సరాలకు ఉపకార వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో విద్యార్థికి సగటున రూ.1.50 లక్షల దాకా బకాయి ఉంది. దాదాపు సగం మంది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారు. ఉపకార వేతన బకాయిలను ఏపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో కోర్సు పూర్తయినప్పటికీ వారికి సర్టిఫికెట్లను బాసర ఐఐఐటీ అధికారులు ఇవ్వడం లేదు.
ఫీజులు చెల్లిస్తేనే సెమిస్టర్–2కు అనుమతిస్తాం
ఉపకార వేతనాలను ఏపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో బాసర ఐఐఐటీ అధికారులు విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేయాల ని నిర్ణయించారు. ఉపకార వేతనాలు రాని విద్యార్థులు ఒక్కొక్కరు ఏడాదికి రూ.36,000 చొప్పున రెండేళ్లకు రూ.72,000 చెల్లించాలని స్పష్టం చేశారు. ఫీజులు చెల్లించని విద్యార్థులను సెమిస్టర్–2కు అనుమతించబోమని నోటీసు బోర్డులో పేర్కొన్నారు. దీంతో ఏపీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల ప్రతినిధులు రెండు రోజులుగా అమరావతిలో సాంఘిక సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ సీఎంవో అధికారులు అనుమతించలేదు. సెమిస్టర్–2కు అనుమతించకపోతే తాము చదువుకు అర్ధంతరంగా స్వస్తి చెప్పాల్సిందేనని ఆవేదన చెందుతున్నారు.
విద్యార్థుల వేదన అరణ్య రోదన
బాసర ఐఐఐటీలో ఏపీ విద్యార్థులు తమ ఉపకార వేతనాల కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది. విద్యార్థుల ప్రతినిధులు సెప్టెంబర్‌లో అమరావతికి వచ్చి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం(సీఎంవో) అధికారులను కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు. అయినా ఉపకార వేతనాలకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. తమ క్యాంపస్‌లోని ఏపీ విద్యార్థులకు ఉపకార వేతనాలు వెంటనే మంజూరు చేయాలని బాసర ఐఐఐటీ డైరెక్టర్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు సెప్టెంబర్ 23న ఓ లేఖ, నవంబర్ 22న మరో లేఖ రాశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం కనీసం స్పందించిన పాపాన పోలేదు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చెల్లుచీటీ
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు కావడం లేదు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత 2014–15 సంవత్సరానికి మాత్రమే ప్రభుత్వం ఫీజులు చెల్లించింది. ఆ తర్వాత పూర్తిగా నిలిపివేసింది. ఏపీ విద్యార్థులు హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వారికి ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయకపోవడంతో చదువులు ఆగిపోతున్నాయి.
రాష్ట్రం విడిపోయినప్పటికీ విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు తెలంగాణలో చదువుకునే అర్హులైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటోంది. విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామంటూనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు పొడుస్తోంది. తెలంగాణలో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు 20,000 మంది ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. సగటున ఒక్కో విద్యార్థికి రూ.30,000 చొప్పున చెల్లించాల్సి వచ్చినా ఏడాదికి రూ.60 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొందరు మరో గత్యంతరం లేక సొంత డబ్బులు చెల్లిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment