
సాక్షి, అమరావతి: భారీ స్థిరచరాస్తులు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన వారు దాఖలు చేస్తున్న రిటర్నులను నిశితంగా గమనిస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నోటీసులు వచ్చే వరకు కాకుండా ముందుగానే పూర్తి వివరాలతో రిటర్నులు దాఖలు చేయాల్సిందిగా విజయవాడ రీజియన్ చీఫ్ కమిషనర్ పీసీ మహంతి అసెస్సీలను కోరారు. డిసెంబర్ 15 లోపు చెల్లించాల్సిన అడ్వాన్స్ ట్యాక్స్‌పై అవగాహన కల్పించేందుకు అమరావతిలో సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది విజయవాడ రీజియన్ ఆదాయపన్ను వసూళ్లలో దూసుకుపోతోందన్నారు. ఈ ఏడాది ఆదాయపన్ను వసూళ్లలో 48 శాతం వృద్ధి నమోదయ్యిందన్నారు. గతేడాది ఇదే కాలానికి ఈ వృద్ధిరేటు కేవలం 20 శాతం మాత్రమేనని చెప్పారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,423 కోట్లు లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు రూ. 1,248.5 కోట్లు వసూలయినట్లు తెలిపారు. టీడీఎస్ వసూళ్లలో వృద్ధి ఆశించినంతగా లేదని దీనిపై మరింత దృష్టి సారించాలన్నారు.