రక్తికట్టని పెయిడ్‌ డ్రామాలు | State People Criticizing TDP Dramas | Sakshi
Sakshi News home page

రక్తికట్టని పెయిడ్‌ డ్రామాలు

Published Thu, Dec 26 2019 5:12 AM | Last Updated on Thu, Dec 26 2019 11:01 AM

State People Criticizing TDP Dramas - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి, గుంటూరు/ గుడివాడ/ధర్మవరం: ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా తెలుగుదేశం పార్టీ తీరులో మార్పురాకపోవడంపై రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ డ్రామాలు, శవరాజకీయాలు ఎప్పటికప్పుడు బయటపడుతున్నా.. ఆ పార్టీ నేతలు వాటిని కొనసాగిస్తుండటంపై మండిపడుతున్నారు. టీడీపీ అధినేత మొదలు.. కార్యకర్తల వరకూ చేస్తున్న డ్రామాలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదల సమయంలో ఓ పెయిడ్‌ ఆర్టిస్ట్‌తో సోషల్‌ మీడియాలో పెట్టించిన పోస్టు రాష్ట్ర మంత్రిని, ఆయన సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉండటంతో ఆ ఆర్టిస్ట్‌పై కేసు పెట్టి జైలుకు పంపారు.

అయినా టీడీపీ నేతలు డ్రామాలు కొనసాగిస్తుండటాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా రైతుల పేరుతో పెయిడ్‌ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుండటాన్ని వారు నిలదీస్తున్నారు. మరోపక్క శవరాజకీయాలు చేస్తున్న టీడీపీ నేతలను ప్రజలే ఛీ కొడుతున్నారు. పరస్పర దాడుల్లో, ఇతర పరిస్థితుల్లో ఎవరైనా చనిపోతే దానిని వైఎస్సార్‌సీపీ నేతలకు ముడిపెట్టడం టీడీపీ నేతలకు రివాజుగా మారిందంటూ ధ్వజమెత్తుతున్నారు.  

వరదల సమయంలో పెయిడ్‌ ఆర్టిస్టులతో..
ఈ ఏడాది వర్షాలకు కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంటే.. టీడీపీ నేతలు పెయిడ్‌ ఆర్టిస్టులను రంగంలోకి దించారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందంటూ దుష్ప్రచారం చేయాలని అనుకున్నారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తిప్పలకట్టకు చెందిన జూనియర్‌ ఆర్టిస్టు కుడితిపూడి సోమశేఖర్‌ చౌదరితో టీడీపీ ఓ వీడియో చేయించింది. ఈ వీడియోలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను, ఆయన సామాజికవర్గాన్ని కించపరుస్తూ మాట్లాడటం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై కృష్ణాజిల్లా పోలీసులు కేసు నమోదు చేసి పెయిడ్‌ ఆర్టిస్టు సోమశేఖర్‌ చౌదరితో పాటు మరికొందరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

 ఏసీ హాల్లో కూర్చోవచ్చని వెళితే..
గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఉసిరికాయల అంకారావు సెప్టెంబర్‌లో పనిమీద గుంటూరుకు వచ్చాడు. అదే సమయంలో పల్నాడు బాధితుల పునరావాస కేంద్రం పేరిట టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరంలో చంద్రబాబును చూడటానికి, ఏసీ హాల్లో కొద్దిసేపు కూర్చోవచ్చనే ఆశతో అక్కడకు వెళ్లాడు. అతన్ని సైతం వైఎస్సార్‌సీపీ బాధితునిగా టీడీపీ చిత్రీకరించింది. జిల్లాలోని బ్రాహ్మణపల్లికి చెందిన మౌలాలీ, యుసూబ్‌ సోదరులతో వైఎస్సార్‌సీపీ నేతలకు వ్యతిరేకంగా ఆ శిబిరంలో స్టేట్‌మెంట్లు ఇప్పించారు. తన 40 ఎకరాల పొలాన్ని సాగు చేసుకోనివ్వకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు గ్రామం నుంచి వెళ్లగొట్టారని మౌలాలీ చెబితే.. 40 సెంట్ల స్థలం లేని మౌలాలీకి 40 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందని ఆ గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.

తోడికోడళ్ల మధ్య గొడవ జరిగితే..
తోడి కోడళ్ల మధ్య జరిగిన గొడవనూ వైఎస్సార్‌ సీపీకి ఆపాదించాలని చంద్రబాబు ప్రయత్నించడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం రుద్రమాంబపురంలో ఈ ఏడాది జూన్‌ 25న బసంగారి పద్మ (28)తో ఆమె తోడికోడళ్లు పాపమ్మ, పెదలక్ష్మి, లక్ష్మిలు గొడవపడ్డారు. ఈ గొడవలో పద్మను తోడికోడళ్లు నడి బజారులో తీవ్రంగా కొట్టడంతో అవమానంగా భావించి ఉరివేసుకొని మృతి చెందింది. ఆ మహిళ మృతికి వైఎస్సార్‌సీపీ నాయకులే కారకులంటూ కట్టుకథ అల్లారు. ఘటన జరిగిన పది రోజుల తరువాత అక్కడకి వచ్చిన చంద్రబాబు రాజకీయ డ్రామాను రక్తి కట్టించేందుకు హంగామా చేశారు. గొడవకు కారణం కుటుంబ కలహాలే అని మృతురాలి బంధువులు, గ్రామస్తులు చెప్పడంతో పచ్చ గ్యాంగ్‌ తోక ముడిచింది. పద్మ మృతికి కుటుంబ కలహాలే కారణమని ఇంకొల్లు సీఐ ఆర్‌ రాంబాబు కూడా స్పష్టం చేశారు.

రైతు బజారులో వ్యక్తి చనిపోతే..
గుడివాడలో నూనె సాంబిరెడ్డి రైతుబజార్‌కు కూరగాయల కోసం వెళ్లి గుండెపోటుతో మరణిస్తే.. అక్కడ కూడా టీడీపీ నేతలు శవరాజకీయానికి తెరతీశారు. ఆయన ఉల్లిపాయల కోసం వెళ్లి చనిపోయారంటూ దుష్ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని మృతుడి కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. ఆయనకు రోజూ శివాలయానికి వెళ్లడం అలవాటని, అక్కడి నుంచి రైతు బజారుకు వెళ్లిన సమయంలో గుండెపోటు వచ్చి చనిపోయారని, తమకు సబ్సిడీ ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజకీయం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు తమ తండ్రి మరణాన్ని వాడుకోవడం సిగ్గు చేటు అంటూ మృతుడి కుమారుడు మహేష్‌రెడ్డి విమర్శించారు.

పక్షవాతం బాధితుడితో డ్రామా
టీడీపీ బురద చల్లే రాజకీయాలకు ఇది తాజా నిదర్శనం. పక్షవాతం కారణంగా కాళ్లు చేతులు చచ్చుబడ్డ ఓ వ్యక్తిని తెరపైకి తెచ్చి వైఎస్సార్‌ సీపీ బాధితుడంటూ టీడీపీ నేతలు బుకాయించారు. ఈనెల 18, 19, 20వ తేదీల్లో అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష జరుగుతున్నపుడు డి.చెర్లోపల్లికి చెందిన శివయ్యను టీడీపీ నేతలు కుర్చీలో వేదికపైకి తెచ్చారు. బత్తలపల్లి మండలం ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు వైఎస్సార్‌సీపీ నేతల దాడిలో ఇలా అయ్యాడంటూ చెప్పారు.

అయితే ఆటో నడిపే శివయ్యకు ఈ ఏడాది జూలై 29న పక్షవాతం వచ్చి కుర్చీకే పరిమితమయ్యాడు. ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరేందుకు చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశానికి వెళ్లాడు. శివయ్యను చూసిన టీడీపీ నేతలు డ్రామాకు తెరతీశారు. ఇతను వైఎస్సార్‌సీపీ బాధితుడు అంంటూ చంద్రబాబు ఆర్థిక సహాయం ప్రకటించి ఇవ్వకుండానే వెళ్లిపోయారు. అయితే టీడీపీ డ్రామా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. తాను కేవలం ఆర్థిక సాయం కోసమే వెళ్లానంటూ శివయ్య చెప్పాడు. ‘లక్ష ఇచ్చిందీ లేదు.. పొయ్యిందీ లేదు.. దళితుడినైన నన్ను ఇలా రచ్చ కీడ్చడమేంటి?’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement