మెడిసిన్‌లో మెరిశారు...
►స్టేట్ టాప్‌టెన్‌లో మూడు ర్యాంకులు
►ఇంజినీరింగ్‌లో 48, 56, ర్యాంకులు మాత్రమే..
►ఎంసెట్ ఫలితాల్లో సత్తా చాటిన జిల్లా విద్యార్థులు
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్ష (ఎంసెట్) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు తమ సత్తాచాటారు. మెడికల్ విభాగంలో రాష్ట్రస్థాయి టాప్‌టెన్‌లో ర్యాంకులు కైవసం చేసుకున్న విద్యార్థులు జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. మెడికల్ విభాగంలో వినుకొండకు చెందిన గుండా జయహరీష్ 4వ ర్యాంకు, గుంటూరుకు చెందిన గజ్జల సాయిధీరజ్‌రెడ్డి 5వ ర్యాంకు, తెనాలి మండలం అంగలకుదురులోని కె.జగదీష్ 7వ ర్యాంకు సాధించారు.
ఇంజినీరింగ్ విభాగంలో స్టేట్ టాప్‌టెన్‌లో ఏ ఒక్క ర్యాంకు జిల్లా విద్యార్థులకు దక్కలేదు. ఇంజినీరింగ్ విభాగంలో గుంటూరు నుంచి పల్లెర్ల కృష్ణ ప్రీతీష్ రెడ్డి 48వ ర్యాంకు, ఎ. లక్ష్మీ హిమవంత్ 56వ ర్యాంకు సాధించారు. గత ఏడాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంసెట్ ఫలితాల్లో జిల్లాకు మెడికల్ విభాగంలో స్టేట్ టాప్‌టెన్‌లో చెప్పుకోదగ్గ ర్యాంకు దక్కని లోటును భర్తీ చేస్తూ తాజా ఫలితాల్లో ఒకే సారి మూడు ర్యాంకులు కైవసం చేసుకోవడం ఈసారి విశేషం.
పేదింట ఆణిముత్యం
మెడిసిన్‌లో వినుకొండ కుర్రోడికి నాల్గవ ర్యాంక్
వినుకొండ టౌన్ : వినుకొండ పట్టణానికి చెందిన గుండా నరసింహరావు, వరలక్ష్మీ దంపతుల చిన్న కుమారుడు జయహరీష్ ఎంసెట్‌లో మెడిసన్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో నాల్గవ ర్యాంక్ సాధించి పేదింట ఆణిముత్యంగా నిలిచాడు. జయ హరీష్ ఒకటి నుంచి 5 వరకు నిర్మల ఇంగ్లిష్ మీడీయం స్కూల్, 6, 7 తరగతులు గుడ్ షెప్పర్డ్ పాఠశాలలో చదివాడు. కృష్ణా జిల్లా గుడివాడ విశ్వభారతి పాఠశాల నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చి ఫీజు రాయితీతో 8 నుంచి 10 వరకు చదివాడు. శ్రీ చైతన్య విజయవాడ బ్రాంచి నిర్వహించిన ఇంటర్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపి బైపీసీ గ్రూపులో ఉచిత సీటు సంపాదించాడు. ఎంసెట్ లో 150 మార్కులు సాధించాడు. ఇంటర్‌లో 983 మార్కులను సాధించాడు. గ్రూప్ సబ్జెక్ట్స్‌లో 600 మార్కులకు 600 సాధించి రికార్డు సృష్టించాడు.
పేద కుటుంబంలో విరిసిన ఆణిముత్యం..
జయహరీష్ తండ్రి నరసింహరావు ఆర్టీసీలో సీనియర్ అసిస్టెంట్‌గా చేస్తున్నారు. పెద్ద కుమారుడు ప్రదీప్ కుమార్ సైతం ఎంసెట్‌లో 200 ర్యాంకు సాధించాడు. జేఈఈఈ మెయిన్స్‌లో అత్యుత్తమ ర్యాంక్ సాధించి ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
- కుటుంబ సభ్యులతో జయ హరీష్
డాక్టర్‌గా పేదలకు సేవ చేయాలని... మెడిసిన్ 7వ ర్యాంకర్ జగదీష్
మారీసుపేట (తెనాలి) : తనకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడిసిన్ చదవాలని ఉందని ఎంసెట్(మెడిసిన్) ఏడవ ర్యాంకర్ కోయి జగదీష్ చెప్పాడు. డాక్టర్‌గా పేదలకు సేవ చేయాలనేది తన లక్ష్యమని తెలిపాడు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెబుతూ తన విజయంలో వారి పాత్ర ఎక్కువని చెప్పాడు. జగదీష్ 7వ ర్యాంక్ సాధించటం పట్ల అతడి కుటుంబ సభ్యులు హర్షం ప్రకటించారు.
తెనాలిలో ఉన్న జగదీష్ తాతయ్య, నాయనమ్మ భాస్కరరావు, సుభాషిణి, బాబాయి కుటుంబ సభ్యులు స్వీట్లు పంపిణీ చేశారు. జగదీష్ తల్లిదండ్రులు రవీంద్ర, సరితాదేవి మాట్లాడుతూ తమ కుమారుడు మొదటి నుంచి విద్యపై ఆసక్తి చూపేవాడన్నారు. పుస్తకాలు చదవటంతోపాటు ఇంటర్నెట్‌లో స్టడీ మెటీరియల్‌ను చదువుతూ ఉండేవాడని చెప్పారు.
ప్రతిభ చూపిన జగదీష్. జగదీష్ ఒకటో తరగతి నుంచి 3 వరకు అంగలకుదురులోని మాస్టర్ మైండ్స్ పాఠశాలలో చదివాడు. 8వ తరగతి వరకు తెనాలి చెంచుపేటలోని గౌతం మోడల్ స్కూల్‌లో చదివాడు. 9,10 తరగతులు తెనాలి చైతన్య టెక్నో స్కూల్‌లో చదివాడు. పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించి పాఠశాలలో ప్రథమంగా నిలిచాడు. ఇంటర్మీడియెట్ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గోశాలలోని నారాయణ శ్రీచైతన్య మెడికల్ అకాడమీలో బైపీసీ చదివాడు. ఇంటర్‌లో 980 మార్కులు సాధించాడు. అక్కడ కొద్ది నెలలు ఎంసెట్ శిక్షణ తీసుకున్నాడు. ఇటీవల జరిగిన ఎంసెట్(మెడిసిన్)లో 153 మార్కులకు 150 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్ సాధించాడు.
కుటుంబ నేపథ్యం..
పొన్నూరు మండలం గరికపాడుకు చెందిన రైతు కోయి రవీంద్ర కుటుంబం పిల్లల చదువుల నిమిత్తం కొన్నేళ్ల కిందట తెనాలి రూరల్ మండలం అంగలకుదురు వచ్చింది. పెద్ద కుమారుడు జగదీష్, రెండవ కుమారుడు సాయి ఆదిత్య. రవీంద్ర భార్య సరితాదేవి గృహిణి.