విజయమ్మ అరెస్టుకు నిరసన
Published Fri, Nov 1 2013 1:46 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
జగ్గంపేట, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రాంతంలో ముంపు ప్రాంతాలు, పంటలు నష్టపోయిన రైతులను ఓదార్చేందుకు పర్యటనకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను గురువారం పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఖండించారు. విజయమ్మ అరెస్టుకు నిరసనగా జగ్గంపేట మెయిన్ రోడ్డు సెంటర్‌లో సాయంత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ విజయమ్మను ఖమ్మం, నల్గొండ సరిహద్దులో పైనంపల్లి వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా తిరిగే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు రైతు సమస్యల పరిష్కారం కోసం పర్యటిస్తే టి- కాంగ్రెస్ మంత్రులు అడ్డుకోవాలని పిలుపునివ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. తెలంగాణలో విజయమ్మకు అపూర్వ స్పందన లభించడంతో అక్కడ వైఎస్సార్ సీపీ పుంజుకుంటుందనే భయంతోనే విజయమ్మను అడ్డగించారని ఆరోపించారు. పార్టీ నేతలు మారిశెట్టి భద్రం, అత్తులూరి నాగబాబు, జీను మణిబాబు, నీలాద్రిరాజు పాల్గొన్నారు.
విజయమ్మపై దాడికి ఖండన
సీతానగరం, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై తెలంగాణ వాదులు దాడి చేయడం పిరికిపంద చర్య అని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అభివర్ణించారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న విజయమ్మ కాన్వాయ్‌పై దాడి హేయమైన చర్య అని అన్నారు. హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం నిర్వహించిన ధైర్యం ఒక్క వైఎస్సార్ సీపీది మాత్రమేనని విజయలక్ష్మి అన్నారు.
Advertisement
Advertisement