భగ్గుమన్న దళితులు | Statewide protests of dalits for Chintamaneni Comments | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న దళితులు

Published Thu, Feb 21 2019 4:34 AM | Last Updated on Thu, Feb 21 2019 12:15 PM

Statewide protests of dalits for Chintamaneni Comments - Sakshi

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న ఎస్సీ సంఘాలు, వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి,నెట్‌వర్క్‌: ‘మీరు దళితులు.. మీకెందుకు రా.. రాజకీయాలు’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దళితులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దళిత, ప్రజా సంఘాలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయితో మండిపడ్డాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, అంబేడ్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించాయి. చింతమనేని దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు. చిత్తూరు జిల్లాలో పలుచోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చిత్తూరు బంగారుపాళ్యం రోడ్డుపై బైటాయించి ధర్నాకు దిగారు. విజయపురం మండలం పన్నూరు సబ్‌స్టేషన్‌ ఆవరణంలో అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తిరుపతి రూరల్‌ మండలంలోని పేరూరు వద్ద వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దామినేని కేçశవులు ఆధ్వర్యంలో చింతమనేని ప్రభాకర్‌ ఫోటోకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. బి.కొత్తకోటలో చింతమనేని వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ అంబేడ్కర్‌ సేవ (బాస్‌) కార్యకర్తలు రాస్తారోకో చేశారు. పుంగనూరులోని అంబేడ్కర్‌ కూడలిలో చింతమనేనికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డెప్ప ఆధ్వర్యంలో హైవేపై బైఠాయించారు. 
ఏయూలో చింతమనేని దిష్టిబొమ్మకు శవయాత్ర చేస్తున్న దళిత, బీసీ, ఎస్టీ సంఘాల నాయకులు 

ఏయూలో చింతమనేని దిష్టిబొమ్మకు శవయాత్ర..
ఆంధ్ర యూనివర్సిటీలో దళిత, బీసీ సంఘాలు నిరసన తెలిపాయి. ఏయూలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదురుగా నాయకులు ధర్నా చేసి చింతమనేని దిష్టిబొమ్మకు శవయాత్ర జరిపారు. చింతమనేనిని తక్షణం అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దిష్టిబొమ్మతో నిరసన తెలపడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిశోధకులు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో ఆరేటి మహేష్, డాక్టర్‌ మోహన్‌ బాబు, మండే సురేష్, కోటి రవికుమార్, కుమారస్వామి పాల్గొన్నారు. చింతమనేనిని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ పదవుల నుంచి తొలగించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో చింతమనేని ప్రభాకర్‌ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. చింతమనేని ఆగడాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నా.. ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతుందని మండిపడ్డారు. 

చింతమనేనిపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు..
ఎస్సీ సామాజిక వర్గాన్ని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దూషించడంపై జాతీయ ఎస్సీ కమిషన్‌లో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) బుధవారం ఫిర్యాదు చేసింది. ఎస్సీ కమిషన్‌ సంయుక్త కార్యదర్శి స్మితా చౌదరికి ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.అనిల్‌కుమార్‌ ఈ ఫిర్యాదు అందజేశారు. చింతమనేనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. 

ఏలూరులో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చింతమనేని వ్యాఖ్యలపై పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో దళితులు ఆందోళనలు నిర్వహించారు. ఏలూరులో చింతమనేని ప్రభాకర్‌ వర్గం నేతలు కూడా పోటీ నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఇరువర్గాలను అరెస్ట్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. తాను మాట్లాడిన మాటలను ఎడిట్‌ చేసి కొద్దిగా మాత్రమే చూపిస్తున్నారని, సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసి తన పరువుకు నష్టం కలిగించిన వారిని అరెస్ట్‌ చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జితో కలిసి చింతమనేని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి వినతిపత్రమిచ్చారు.

‘సాక్షి’పై చింతమనేని అక్కసు...
చింతమనేని వ్యాఖ్యలపై ‘సాక్షి’ పత్రికలో కథనం రావడంతో ఆయన బుధవారం ఉదయం ఏలూరులోని సాక్షి జిల్లా కార్యాలయానికి వచ్చారు. ‘నా గురించి పిచ్చిపిచ్చి వార్తలు రాస్తున్నారు...ఆ వార్త రాసిన విలేకరి ఏడీ’ అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. ఇంకా రాలేదని చెప్పడంతో వస్తే నన్ను కలవమని చెప్పండంటూ అక్కడి నుంచి ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌కు వెళ్లారు. కొద్దిసేపట్లో అక్కడ వైఎస్సార్‌సీపీ దళిత సంఘాలు ఆందోళన నిర్వహిస్తాయని సమాచారం అందుకుని పోటీ ధర్నా చేసేందుకు సమాయత్తమయ్యారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సోషల్‌ మీడియాలో తన వీడియోను వైరల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ, అదనపు ఎస్పీలకు వినతిపత్రమిచ్చారు. ఈలోగా ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్, దళిత సంఘాల ఆధ్వర్యంలో దళితులు ధర్నా చేసేందుకు ఉపక్రమించారు. అక్కడ చింతమనేని అనుచరులు పోటీ ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ ముందు వైఎస్సార్‌ సీపీ నేతలు ధర్నా చేశారు. ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్‌ వీరికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఇరువర్గాలను పోలీసులు విడిచిపెట్టారు. చింతమనేని తన అనుచరులతో పాత బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుని అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి ధర్నాకు దిగారు. తన మాటలను వక్రీకరించారని, తాను తప్పు చేశానని నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమని చెప్పారు.
 
హౌస్‌ అరెస్టులపై అభ్యంతరం..
దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్టు చేయడం వివాదానికి దారి తీసింది. బుధవారం ఉదయం వైఎస్సార్‌ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అబ్బయ్య చౌదరిని ఏలూరులోని పార్టీ కార్యాలయానికి బయలుదేరుతుండగా పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. దీనిపై అబ్బయ్య చౌదరి అభ్యంతరం వ్యక్తం చేసి ఆయన ఇంటి ముందు బైఠాయించారు. అనంతరం ప్రదర్శనగా ఏలూరుకు చేరుకుని అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి చింతమనేని దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గంటా ప్రసాదరావు ఈ నెల 22 నుంచి బీసీ సంఘం తరపున నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. దీనికి మాదిగ మహాసేన దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ (డీబీఆర్సీ) సంఘాలు మద్దతు ప్రకటించాయి. కొవ్వలిలో మాల మహానాడు అధ్యక్షుడు గొల్ల అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మాలమహానాడు, వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన తెలిపారు. అక్కిరెడ్డిగూడెంలో మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు టి.శేఖర్‌ ఆధ్వర్యంలో ఆందళోన చేశారు. చింతమనేని వ్యాఖ్యలను ఖండిస్తూ మార్టేరు సెంటర్‌లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చింతమనేని ఎమ్మెల్యే పదవిని రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్‌ డిమాండ్‌ చేశారు. చింతలపూడి వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త వీఆర్‌.ఎలిజా, గోపాలపురం సమన్వయకర్త తలారి వెంకట్రావు నేతృత్వంలో ఆయా ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. చింతమనేనిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ఎస్సీ సెల్‌ నేతలు ఫిర్యాదు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement