సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట కృష్ణాతీరంలో రిజర్వ్ కన్జర్వేటరీలో నిబంధనలకు విరుద్ధంగా నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన నివాసం వైపు రాత్రి వేళల్లో వాహనాలు వెళ్లనీయకుండా నిలుపుదల చేశారు. అయితే ఎన్నికలు ముగిసి, తెలుగుదేశం పార్టీ ఓడిపోయి, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి, ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమితమైనప్పటికీ ఇప్పటికీ కూడా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత చంద్రబాబు నివాసం వైపు ప్రయాణికులను, రైతులను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు ఆయన ఇంటికి మూడు వైపులా దారులు మూసివేశారు.
మరోవైపు కృష్ణానదిలో మత్స్యకారులను వెళ్లనీయకుండా నిరంతరం పోలీసులు కాపలా కాస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సీతానగరం కొండవీటివాగు హెడ్‌స్లూయిస్ నుంచి చంద్రబాబు నివాసానికి 3 కి.మీ.ల దూరం ఉంటుంది. కొండవీటి వాగుకి, కరకట్టకు మధ్య సుమారు 500 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. ఈ పంట పొలాల్లో ఎక్కువ శాతం పూల తోటలు, కూరగాయలు ఉండటంతో రైతులు తెల్లవారుజామున ఒంటిగంట నుంచి మూడు గంటల సమయంలో పొలాలకు వెళుతుంటారు.
రైతులను పొలాలకు వెళ్లనీయకుండా పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారం కోల్పోయినా చంద్రబాబునాయుడు పెత్తనం చెలాయిస్తున్నాడని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. ఈ విషయమై ఆ ప్రాంత రైతులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడంలో దౌర్జన్యంగా నివాసం ఉంటున్నాడని, కష్టపడే రైతు పంట పొలానికి వెళ్లనీయకపోతే సహించేది లేదని, రెండు మూడు రోజుల్లో పోలీసులు బారికేడ్లు తొలగించకపోతే, ఆయన ఇంటిముందే కూర్చుంటానని ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment