గాలివాన బీభత్సం
► నగరంలో రెండు గంటల పాటు భారీ వర్షం
►పలుచోట్ల రాలిన వడగండ్లు
► గాలులకు నేలవాలిన విద్యుత్ స్తంభాలు
► విద్యుత్ సరఫరాకు అంతరాయం.. అంధకారంలో నగరం
► విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి
హోరుగాలి.. జోరువాన.. గుంటూరును అతలాకుతలం చేశాయి. శనివారం సాయంత్రం రెండు గంటలపాటు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడటంతో నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారం అలుముకుంది. యార్డులో మిర్చి బస్తాలు తడిసిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
సాక్షి, గుంటూరు: గుంటూరులో గాలివాన శనివారం బీభత్సం సృష్టించింది. హోరుగాలితో రెండు గంటల పాటు వడగళ్లవాన కురిసింది. దీంతో నగరవాసులు కొన్ని గంటలపాటు అతలాకుతలమయ్యారు. మధ్యాహ్నం జిల్లాలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం ఊహించని రీతిలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు విస్మయానికి గురయ్యారు. గాలులకు నగరంలో పలు చోట్ల విద్యుత్ తీగలు కిందపడగా కొన్నిచోట్ల స్తంభాలు నేలవాలాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఇంకొన్ని చోట్ల భారీ హోర్డింగ్‌లు భవనాల నుంచి కిందపడ్డాయి.
ఏయే ప్రాంతాల్లోనంటే..!
నగరంలోని చుట్టుగుంట సెంటర్, కిడాంబీనగర్, చిలకలూరిపేట రోడ్డులోని వై–జంక్షన్, అరండల్‌పేట, బ్రాడీపేట, ఏటీ అగ్రహారం, మంగళదాస్‌నగర్, పాత గుంటూరుతో పాటు నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కంకరగుంట ఆర్‌యూబీ, మూడు వంతెనల సెంటర్ పూర్తిగా జలమయం కావడంతో వాహన దారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విద్యుత్‌శాఖకూ నష్టం..
గాలివాన సృష్టించిన బీభత్సానికి విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లింది. నగరానికి ఐదు ప్రధాన ఫీడర్ల ద్వార విద్యుత్ సరఫరా అవుతుండగా గాలివానకు అవన్నీ బ్రేక్ డౌన్ అయ్యాయి. దీంతో నగరంలో విద్యుత్ సరఫరా నిలిచి అంధకారం నెలకొంది. చుట్టుగుంట సెంటర్ వద్ద భారీ హైటెన్షన్ తీగలు, విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. విద్యుత్‌శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించడానికి రంగంలోకి దిగారు. 33, 11 కేవీ విద్యుత్ తీగలను సవరించేందుకు రాత్రంతా పనిచేశారు.
మిర్చి రైతులకు కన్నీరే దిక్కు..
ఒకవైపు ధరలు లేక మిర్చి రైతులు ఇబ్బంది పడుతుంటే అకాల వర్షాలు కూడా వారిని నిండా ముంచుతున్నాయి. యార్డులో నిల్వ ఉంచిన వెయ్యి బస్తాల మీర్చి నీటి పాలై ఇప్పటికే రూ. 20 లక్షల మేర నష్టం వాటిల్లింది.
విద్యుదాఘాతంతో ఉద్యోగి మృతి..
గాలివాన వచ్చిన సమయంలో వస్త్రలత కాంప్లెక్సులో పనిచేస్తున్న నల్లచెరువుకు చెందిన షేక్ బషీర్ (25) విధుల్లో భాగంగా కాంప్లెక్స్ పైభాగానికి వెళ్లగా ప్రమాదవశాత్తు హైటెన్షన్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.