రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఫిట్‌మెంట్ అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదే శ్, తెలంగాణా రాష్ట్రాల ఆర్టీసీ
రాజమండ్రి సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఫిట్‌మెంట్ అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదే శ్, తెలంగాణా రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులు బుధవారం తెల్లవారుజాము నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. రెండు రాష్ట్రాలలో కార్మికులు సమస్యల పరిస్కారం కోసం పనిచేయాల్చిన ఆర్టీసీ యాజమాన్యం తాత్సారం చేస్తుండటంతో మార్చి నెలలో హైదరాబాద్ సంస్థ ఎండీ నిర్వహించిన సమావేశంలో ఏప్రిల్‌లో అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించినా... ప్రభుత్వం ఏమాత్రం చ ర్యలు చేపట్టకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు. బుధవారం ఉదయం డిపో నుంచి ఒక్క బస్సు బయటకు రానివ్వబోమని కార్మికులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది డిపోలలో బస్సులు తిరగనిచ్చేది లేదంటూ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయూస్ యూనియన్, తదితర యూనియన్ల కార్మికులు ప్రతిజ్ఞబూనారు.
జిల్లాలో రూ.కోటికి పైగా నష్టం
జిల్లాలో తొమ్మిది డిపోలకు సంబంధించి సుమారు 4200 మంది కార్మికులు ఉండగా, వారిలో 2000 మంది డ్రైవర్లు,1400 మంది కండక్టర్లుకాగా మిగిలిన వారంతా వివిధ విబాగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెకపోవడంతో సుమారు నాలుగు లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడనున్నారు. దీంతో జిల్లాలో సుమారు రూ. కోటి పైగా నష్టం రానుందని అంచనా.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల ఎనిమిదో తేదీ శుక్రవారం జరగనున్న ఎంసెట్ పరీక్ష రాసే వేలాది మంది విద్యార్థులు తీవ్ర అవస్థలు పడనున్నారు. అదే విధంగా 14వ తేదీ గురువారం తెలంగాణాలో జరగనున్న ఎంసెట్ పరీక్షలు రాసే విద్యార్థులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక తీవ్ర అవస్థలు పడనున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం : ఆర్‌ఎం రవికుమార్
జిల్లాలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెను ఎదుర్కొని ప్రయాణికులకు సరైన బస్సులు ఏర్పాటు చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించామని బుధవారం తెల్లవారు జాము నుంచి బస్సులను యథావిధిగా తిప్పే ప్రయత్నం చేస్తున్నట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు. పోలీస్, హోంగార్డ్, సీనియర్ డ్రైవర్లు ,10 వతరగతి పాసైన వారిని బస్సులు నడిపేందుకు టికెట్లు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు.