ఆర్టీసీలో సమ్మెకు సై...
* 11 నుంచి సమ్మెపై వెనక్కు తగ్గేది లేదు: ఈయూ
* ఆందోళనకు పార్టీలు, కార్మిక సంఘాల మద్దతు
* 9న చర్చలకు ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వం
రేపు చర్చలు
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈనెల 9న ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కార్మిక సంఘాల నాయకులను పిలిచారు. ఇప్పటికే ఒకసారి మంత్రి సిద్ధా రాఘవరావు చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి లేదు.
సాక్షి, విజయవాడ బ్యూరో, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకునేవరకూ పోరాటం చేయాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నిర్ణయించింది. ఈనెల 11వతేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో ఈయూ ఆధ్వర్యంలో ఆదివారం అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.
ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ నేతలు దీనికి హాజరయ్యూరు. ఆర్టీసీ మనుగడ కోసం చేస్తున్న ఈ ఆందోళనకు అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు బాసటగా నిలవాలని ఈయూ నేతలు విజ్ఞప్తి చేశారు. గతంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు సంస్థను నిలబెట్టుకునేందుకు ఉద్యమ బాట పడుతున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీకి రూ.250 కోట్లు ఇస్తానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తక్షణం బకారుులు చెల్లించాలి
ఆర్టీసీ చట్టం 1950 ప్రకారం 1: 2 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1995-96 తరువాత విస్మరించాయని ఈయూ నేతలు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద కార్మికులు దాచుకున్న రూ.444 కోట్లను యాజమాన్యం ఖర్చు చేసిందని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ.700 కోట్లు రావాల్సి ఉందన్నారు. బకారుుల విడుదల, ప్రైవేటీకరణను విరమించుకోవాలని, సీసీఎస్ సొమ్మును యాజమాన్యం నుంచి రికవరీ చేయాలనే 8 డిమాండ్లతో తీర్మానాలు చేశారు.
సమ్మెకు పలు యూనియన్ల సంఘీభావం..
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈయూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగారుు. కడపలో ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, ముఖ్య ఉపాధ్యక్షుడు పీవీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కడప మేయర్ కె.సురేష్‌బాబు, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు దీనికి హాజరయ్యూరు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో టీడీపీ నేతలు గైర్హాజరుకాగా వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లాలో జోనల్ కార్యదర్శి ఎండీ ప్రసాద్ , సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొన్నారు.