టీడీపీ పొత్తున్నా.. పార్టీ విస్తరణకు కృషిచేయాలి
దిశానిర్దేశం
టీడీపీ పొత్తున్నా.. పార్టీ విస్తరణకు కృషిచేయాలి
టార్గెట్లు దాటితే ఒంటరి పోరాటం
నేతలు, కార్యకర్తలకు కమల దళపతి
అమిత్‌షా సూచన
విజయవాడ : టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ పార్టీని విస్తరించేందుకు కృషిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర రాజధానిగా ఉన్న విజయవాడ కేంద్రంగా పార్టీని అభివృద్ధి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును ఆదేశించారు. రాజధాని ఉన్న జిల్లా కావడంతో ఇక్కడ టార్గెట్లు పూర్తి చేయాలని జిల్లా, నగర అధ్యక్షులకు సూచించారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి నగరానికి వచ్చిన అమిత్‌షాకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆయన్ను కలిసేందుకు 13 జిల్లాలకు చెందిన కాషాయ నేతలు నగరానికి తరలివచ్చారు. ముందుగా గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్‌లో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో పార్టీని విస్తరించకపోవడంపై అమిత్ షా నాయకులతో చర్చించారు. టీడీపీకి మిత్రపక్షంగా ఉండటం వల్ల పార్టీకి జరుగుతున్న లాభానష్టాలు బేరీజు వేసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో నిర్ణీత లక్ష్యం 45 లక్షల సభ్యత్వం దాటితే వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేసేందుకు అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. అనంతరం స్థానిక ఐవీ ప్యాలెస్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో నాయకులు, కార్యకర్తలతో అమిత్‌షా మాట్లాడారు.
సభ్యత్వ నమోదే టార్గెట్...
అమిత్‌షా తన ప్రసంగంలో సభ్యత్వ నమోదునే టార్గెట్ చేశారు. నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తే మనమంతా కలిసి పార్టీని అభివృద్ధి చేద్దామంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త వారం రోజులూ పనిచేసి పార్టీ సభ్యత్వం పెంచాలని సూచించారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి...
సభ్యత్వాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరని రాష్ట్రస్థాయి నేతల సమావేశంలో అమిత్‌షా స్పష్టంచేశారు. ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు ఇబ్బందిగా ఉందని, మారుమూల గ్రామాల్లో ప్రజలు ఇంకా సెల్‌ఫోన్లు వాడటం లేదని కొన్ని జిల్లాల ప్రతినిధులు అమిత్ షా దృష్టికి తీసుకురాగా, అటువంటి వారిని పక్కన పెట్టాలని ఆయన సూచించారు. రశీదుల ద్వారా సభ్యత్వం నమోదు చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదని, అటువంటి కార్యకర్తలు పార్టీలో పనిచేయరని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇదే సమావేశంలో పాల్గొన్న నేతలు టీడీపీ నేతలు తమకు సహకరించడం లేదని తమను పట్టించుకోవడం లేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ గెలవనిచోట కూడా ఇన్‌చార్జిలను పెట్టి వారే పెత్తనం చేస్తున్నారని కమలనాథులు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై కొంత సమన్వయంతో వ్యవహరించాలని నేతలకు ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసి అవన్నీ తమ పథకాలుగా చెప్పుకొంటోందని కొంతమంది నేతలు ఆయన దృష్టికి తీసుకురాగా, కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పార్టీ వారధిలాగా పనిచేయాలని చెప్పారు. పార్టీ వైపు మైనార్జీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఆకర్షించేలా ప్రయత్నించాలని దిశానిర్దేశం చేశారు.
అమిత్‌షాకు వీడ్కోలు
గన్నవరం : న్యూఢిల్లీ వెళ్లేందుకు శుక్రవారం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు పలువురు రాజకీయ ప్రముఖులు, కేంద్రమంత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఢిల్లీ వెళ్లారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు. వారికి వీడ్కోలు పలికినవారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎంపీ గోకరాజు గంగరాజు, రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, పార్టీ రాష్ట్ర నాయకులు చిగురుపాటి కుమారస్వామి, వల్లూరి శ్రీమన్నారాయణ, రంగప్రసాద్, అల్లూరి శ్రీరామ్, రామినేని వెంకటకృష్ణ, నాదెండ్ల మోహన్, పామర్తి పవన్‌కుమార్ తదితరులు ఉన్నారు.