- 2019 ఎన్నికల నాటికి పార్టీని బలీయమైన శక్తిగా మార్చాలి
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలీయమైన శక్తిగా మార్చేందుకు నాయకులు, కార్యకర్తలు నడుం బిగించాలని పార్టీ అగ్రనేతలు పిలుపునిచ్చారు. ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు అగ్రనేతలు శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. బీజేపీ నూతన అధ్యక్షుడి నియామక ప్రక్రియను పార్టీ జాతీయ నాయకత్వం ఒక కొలిక్కి తీసుకొచ్చింది. రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడి పేరు దాదాపుగా ఖరారైనట్టేనని, ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చాక ఆయన ఆమోదం తీసుకుని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీ విస్తరణపై రాజీ పడొద్దు
బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో అనేక అంశాలపై అమిత్ షా ఒకింత కఠినంగానే మాట్లాడినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... 2019 ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ బలోపేతం కావడమే ఏకైక ఎజెండాగా నేతలు, కార్యకర్తలంతా ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు. బీజేపీలో చేరేందుకు ఏ పార్టీ నుంచి నాయకులు వచ్చినా ఆహ్వానించాలని సూచించారు. మిత్రపక్షమైన టీడీపీ నుంచి నేతలు వచ్చినా ఆహ్వానించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘పార్టీని త్యాగం చేయాల్సిన పనిలేదు. అంశాల వారీగా పోరాటాలు చేయొచ్చు. మిత్రధర్మాన్ని పాటిస్తూనే రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలి. ’’ అని అమిత్ షా సూచించారు.
చేరికల కోసం కమిటీ
అలాగే ఇతర పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్న వారిని గుర్తించి అక్కున చేర్చుకునేలా ఒక కమిటీని వేయాలని సూచించారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, పార్టీ జాతీయ నేతలు రామ్‌మాధవ్, మురళీధర్‌రావు, జేపీ నడ్డా, సిద్ధార్థనాథ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో నాలుగు కీలక సమావేశాలు
రానున్న సంవత్సర కాలంలో ఏపీలో నాలుగు కీలక సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. అమిత్ షాతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీలో బలోపేతమే ఏకైక ఎజెండా
Published Sat, Jul 9 2016 2:20 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement