ఇసుకాసురుల ధన దాహానికి బాలుడు బలి
స్వర్ణముఖి నదిలోమునిగిన విద్యార్థి
మృతదేహం కోసం గాలింపు
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
ఇసుకాసురుల ధన దాహానికి బాలుడు బలయ్యాడు. కొందరు నిబంధనలకు విరుద్ధంగా స్వర్ణముఖి నదిలో 20 అడుగులకు పైగా ఇసుకను తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో నీరు ప్రవహించింది. సోమవారం మధ్యాహ్నం తిరుచానూరు వైష్ణవి నగర్‌కు చెందిన బాలుడు ఈత కోసమని వెళ్లి గుంతలో మునిగిపోయాడు.
తిరుచానూరు : తిరుచానూరు పంచాయతీ యోగిమల్లవరం గ్రామం వినాయకనగర్‌కు చెందిన ఆర్ముగం, గుణవతీలకు ముగ్గురు సంతానం. వారు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కొడుకు బాలాజీ(13) తిరుచానూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటర్‌వెల్ ఇవ్వడంతో మరో 8 మంది విద్యార్థులతో కలిసి ఈత కొట్టేందుకు స్వర్ణముఖి నదికి వెళ్లాడు. నది మధ్యలో పెద్ద గుంత ఉండడంతో మునిగిపోయాడు. విద్యార్థులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు.
మృతదేహం కోసం గాలింపు
గ్రామ సర్పంచ్ రామచంద్రారెడ్డి, రూరల్ తహశీల్దార్ యుగంధర్, ఎంపీడీవో రవికుమార్‌నాయుడు, డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, పంచాయతీ ఈవో ఎం.జనార్థన్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ శంకర్‌ప్రసాద్ తన బృందంతో కలిసి అక్కడికి చేరుకుని బాలుడి మృతదేహం కోసం గాలించారు. మృతదేహం లభ్యంకాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి.
మిన్నంటిన రోదనలు
విద్యార్థి మృతి చెందాడన్న సమాచారం తెలుసుకున్న బాలాజీ తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికిచేరుకున్నారు. ఇంటికి పెద్ద కొడుకైన బాలాజీ బాగా చదువుకుని పెద్దవాడై కష్టాల నుంచి కడతేరుస్తాడని నమ్ముకున్న ఆ కుటుంబానికి నదిలో కడతేరి విషాదం మిగిల్చాడని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు
తిరుపతి నగరం అభివృద్ధి చెందుతుండడంతో కొందరు అక్రమార్కులు స్వర్ణముఖి నది నుంచి ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారు. దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పిల్లలు గుంతల్లో ఈతకొట్టేందుకు వెళ్లి మృతిచెందుతున్నారు.