రావాడ వట్టిగెడ్డలో సోమవారం గల్లంతైన కురుపాం విద్యార్థి అన్వేష్ కోసం మూడు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ కానరాలేదు.
జియ్యమ్మవలస: రావాడ వట్టిగెడ్డలో సోమవారం గల్లంతైన కురుపాం విద్యార్థి అన్వేష్ కోసం మూడు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ కానరాలేదు. జాలర్లు అదేపనిగా వెతుకుతున్నా జాడ తెలియరాకపోవడంతో బుధవారం ఉదయాన్నే జిల్లా అదనపు సంయుక్త కలెక్టరు యూసీజీ నాగేశ్వరరావు,పార్వతీపురం ఇన్‌చార్జ్ సబ్‌కలెక్టరు ఆర్.శ్రీలక్ష్మి ,పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చేయవలసిన ప్రయత్నాలు చేశామని, 15 అడుగుల లోతు వరకు మాత్రమే వెళ్లగలమని, జాలర్లు,అగ్నిమాపక సిబ్బంది,గజ ఈతగాళ్లు చెప్పారు. వట్టిగెడ్డలో 35 అడుగుల లోతులో నీరు ఉండడంతో లోపలకు వెళ్లలేమని ఈతగాళ్లు చెప్పడంతో చేసేది లేక విషయాన్ని కలెక్టరు ఎం.ఎం.నాయక్‌కు తెలియజేసి నేవీ బృందాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. నేవీ బృందం సాయంత్రానికి వ స్తుందని అధికారులకు సమాచారం వచ్చింది కానీ సాయంత్రం 5 గంటల వరకు ఆ బృందం రాలేదు. బుధవారం గాలింపు చర్యల్లో ఇరిగేషన్ ఈఈ జి.వి.రమణ,అసిస్టెంట్ డెరైక్టరు అఫ్ ఫిషరీష్ ఫణి ప్రకాశ్,ఫైర్ ఆఫీసరు కేవీటీ ప్రసాదరావు, సీఐ వి.చంద్రశేఖర్,చినమేరంగి,జియ్యమ్మవలస ఎస్సైలు పప్పల పాపారావు, ఎ.హరికృష్ణ, గుమ్మలక్ష్మీపురం ఫైర్ ఆఫీసరు ఎ.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.