
రోడ్డెక్కిన విద్యార్థులు
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు
బొబ్బిలి : ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. జిల్లా కార్యదర్శి కోట అప్పన్న ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్దకు ర్యాలీగా చేరుకుని మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను తరగతులకు రానివ్వడం లేదని, కోర్సులు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆందోళన వల్ల రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఇచ్చిన గడువు కంటే విద్యార్థులు ఎక్కువ సేపు ఆందోళన చేపట్టడంతో ఎస్సైలు నాయుడు, శేఖర్ సిబ్బందితో అక్కడకు వచ్చి ఆందోళన విరమించాలని కోరారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకూ ఆందోళన విరమించమని విద్యార్థులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు విద్యార్థులను బలవంతంగా లేవనెత్తడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీస్ జులుం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు బస్సులు, పోలీస్ వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకుని తర్వాత సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. లాఠీచార్జీ వల్ల నలుగురు విద్యార్థులు గాయపడ్డారని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి కోట అప్పన్న తెలిపారు. కాగా పోలీసుల తీరుపై సీపీఐ నాయకుడు ఒమ్మి రమణ నిరసన వ్యక్తం చేశారు.
సాలూరులో రాస్తారోకో ..
సాలూరు:ఫీజు రీయింబర్స్‌మెంట్,ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహిం చారు. జిల్లా కార్యదర్శి నాగేంద్ర ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు స్థానిక బోసుబొమ్మ జంక్షన్‌వద్ద ఆందోళనచేపట్టి వాహన రాకపోకలను అడ్డు కున్నారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ, గురువారం చేపట్టిన ఆందోళనలో తమ నాయకులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు రిబిక, గౌరి, మహేష్, ప్రేమ్‌కుమార్, బాలు, త్రివేణి, వినీత, తదితరులు పాల్గొన్నారు.