ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలు
పార్వతీపురం టౌన్: పాడైన ఆహారం తిన్న 45మంది విద్యారి్థనులు రాత్రికి రాత్రి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు లోనై ఆస్పత్రి పాలయ్యారు. పార్వతీపురం మండలం కవిటిభద్ర కేజీబీవీ వసతిగృహంలో మంగళవారం మధ్యాహ్నం వండి వడ్డించగా మిగిలిన కూరలు, పెరుగు రాత్రి వేళ కూడా విద్యారి్థనులకు బలవంతంగా వడ్డించడంతో గత్యంతరం లేక వాటిని తిన్న వారంతా అనారోగ్యం పాలయ్యారు. మొత్తం 165మంది విద్యారి్థనుల్లో 45మందికి విరేచనాలు, వాంతులు ఒక్కసారిగా ప్రారంభం కావడంతో అందుబాటులో ఉన్న ఏఎన్‌ఎం ప్రాథమిక చికిత్స అందించి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి పూర్తి చికిత్సకోసం తరలించారు. అనారోగ్యం పాలైనవారిలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులున్నారు.
వెంటనే పాఠశాల స్పెషల్ ఆఫీసర్ పి.వరలక్ష్మి, సిబ్బంది హుటాహుటిన వారిని రాత్రికి రాత్రి ఆస్పత్రిలో చేర్పించి అత్యవసర చికిత్సను ఇప్పించారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్–2 ఆర్.కూర్మనాథ్, జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి బుధవారం ఉదయం ఏరియా ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై దర్యాప్తు చేశారు. విద్యారి్థనుల ఆరోగ్యంపరిస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రూరల్ ఎస్‌ఐ వీరబాబు, తహసీల్దార్ శివన్నారాయణ, ఎంఈఓ కృష్ణమూర్తి, ఎంపీడీఓ కె. కృష్ణారావు తదితర అధికారులు ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వద్దన్నా వడ్డించడం వల్లే...
మధ్యాహ్నం వడ్డించగా మిగిలి పోయిన పెరుగు వేసుకునేందుకు పిల్లలు అంగీకరించలేదు. కానీ ఊరికే వృథా అవుతుందన్న కారణంతో సిబ్బంది బలవంతంగా వారిచే తినిపించారు. అదే వారి కొంప ముంచింది. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వాగ్దేవి ఆధ్వర్యంలో వైద్యబృందం తక్షణ వైద్యసేవలు అందించడంతో ప్రమాదం తప్పింది. కోలుకున్న 30మంది విద్యారి్థనులకు అల్పాహారం ఇచ్చి హాస్టల్‌కు తిరిగి పంపించారు. మిగిలిన వారికి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించి మెరుగుపడేంతవరకు ఆస్పత్రిలో ఉంచారు. వారిలో ముగ్గురు కోలుకొనేందుకు రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు.
అధికారుల ఆరా...
విద్యారి్థనుల అస్వస్థత విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి, జాయింట్ కలెక్టర్–2 ఆర్. కూర్మనాథ్ బుధవారమే పార్వతీపురం ఆస్పత్రికి వచ్చి విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరా తీశారు. ఫుడ్‌పాయిజినింగ్ కారణాలపై సిబ్బందిని నిలదీశారు. ఇకపై ఇలాంటి పరిణామాలు ఎదురైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశమై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. రాష్ట్ర బాలబాలికల హక్కుల కమిషన్ మెంబర్ పి.వి.వి.ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యారి్థనులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీకి వెళ్లి పరిసరాల శుభ్రత, విద్యార్థుల ఆరోగ్యంపట్ల పాఠశాల సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను ఆరా తీశారు.
ఏమైపోతుందోనని భయపడ్డాం..
రాత్రి భోజనం చేసిన తరువాత కొంత సేపటికి వసతిగృహంలో చాలా మంది అమ్మాయిలకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయని ఏఎన్‌ఎంకు చెప్పాం. ఆమె మాత్రలు ఇచ్చినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో భయపడ్డాం. ఎస్‌ఓ మేడమ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను ఇప్పించారు. భోజనంలో నాణ్యత లేకపోవడంవల్లే ఇలా అయింది.
– ఎస్.శరణ్య, విద్యార్థిని
పాడైన ఆహారం వల్లే...
రాత్రి భోజనంలో మధ్యాహ్నం మిగిలిన కూరలు, పెరుగు ఇచ్చారు. వాటిని తిన్న తరువాతనే వాంతలు, విరేచనాలు మొదలయ్యాయి. దాదాపు అందరిదీ అదే పరిస్థితి కావడంతో విషయం తెలుసుకుని ఎస్‌ఓ మేడమ్, ఏఎన్‌ఎం మమ్మల్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స ఇప్పించారు.
– ఎస్.శకుంతల, విద్యార్థిని
పుల్లని పదార్ధాలు ఇవ్వవద్దు..
పులిసిన, చెడిపోయిన పదార్ధాలు విద్యార్థులకు ఇచ్చి వారి ఆరోగ్యంతో ఆటలాడుకోవదు. అదృష్ట వశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డాం. పూర్తిస్థాయి విచారణ చేపట్టి... పరిస్థితులు పునరావృతం కాకుండా చూస్తాం. ప్రస్తుతానికి విద్యారి్థనుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
– జి.నాగమణి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment