
సాక్షి, విజయవాడ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహణ బాధ్యత సాధువులకు అప్పగిస్తే అభివృద్ధి జరుగుతుందని తన నమ్మకమని ప్రముఖ న్యాయవాది, బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. టీటీడీ పై తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించిందని తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 6న వాదనలు వినిపించనున్నట్లు పేర్కొన్నారు.‘హైకోర్టు ఆధ్వర్యంలో ఆడిట్ కమిటీ నియమించాలి. టీటీడీ ప్రభుత్వం చేతుల్లో ఉంది. దేవాలయాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉండకూడదు అనేది నా సలహా. టీటీడీకి వచ్చిన ఆదాయాన్నిరాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోంది. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం టీటీడీ వ్యవహారంలో చాలా దారుణంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్కస్‌లో కోతి మాదిరి బాబు..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కస్‌లో కోతి మాదిరి అటూ ఇటూ దూకుతున్నారని సుబ్రమణ్య స్వామి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం చేస్తానని చెప్పినప్పటికీ.. నాలుగేళ్ల తమతో కలిసి ఉన్న చంద్రబాబు చివరి సంవత్సరం కాంగ్రెస్ పంచన చేరారని విమర్శించారు. ‘ప్రత్యేక హోదా ఇవ్వలేదనే నెపంతో చంద్రబాబు కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. మొదటి సంవత్సరమే ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పాం మరి అప్పుడు ఏం చేశారు అని సుబ్రమణ్య స్వామి ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహారం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment