ఏ శాఖ అప్పగించిన సమర్థవంతంగా నిర్వహిస్తా: సుజనా
హైదరాబాద్: కేంద్రమంత్రిగా తనకు ఏ శాఖ బాధ్యతలు అప్పగించిన సమర్థవంతంగా నిర్వహిస్తానని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వెల్లడించారు. కేంద్రమంత్రిగా తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వీనియోగం చేసుకుంటానన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబుతో సుజనా చౌదరి భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్బంగా మీకు కేంద్రమంత్రి పదవి వరించనుందని విలేకర్ల అడిగిన ప్రశ్నకు సుజనా పైవిధంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అని విధాల తోడ్పాటు అందిస్తానని చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని సుజనా చౌదరి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తనకు ఫోన్ చేసి కేంద్ర మంత్రి విషయం వెల్లడించారని ఈ సందర్భంగా సుజనా వెల్లడించారు.
సుజనా చౌదరి అసలు పేరు యలమంచిలి సత్యనారాయణ చౌదరి. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లాలోని కంచికచర్ల. సుజనా చౌదరి బాల్యం అంతా హైదరాబాద్లో సాగింది. ఆయన మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆయన తండ్రి యలమంచిలి జనార్దనరావు నీటిపారుదల శాఖ ఉద్యోగిగా విధులు నిర్వహించారు.