బొబ్బిలి: ‘అగ్రి గోల్డు కార్యాలయాల్లో నాలుగు నెలలుగా లావాదేవీలను నిలిపివేశారు. ఖాతాదారుల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం. ఇప్పటికే 8 మంది గుండెపోటుతో చనిపోయారు. యాజమాన్యం పలకడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు అండగా ఉండి అదుకోవాలి’ అని అగ్రిగోల్డు ఏజెంట్లు బొబ్బిలి ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్.వి.సుజయకృష్ణ రంగారావును కోరారు. పార్వతీపురం డివిజన్‌లోని అగ్రి గోల్డు ఏజెంట్లు సోమవారం ఆయనను బొబ్బిలి కోటలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి నాలుగో తేదీ నుంచి లావాదేవీలను నిలిపివేశారన్నారు. గ్రామాల్లో ఖాతాదారులు ఏజెంట్లపై దాడులకు వస్తున్నారని చెప్పారు.
వారి ఒత్తిడి తట్టుకోలేక చిన్న వయసులో ఉన్నవారు కూడా గుండెపోటుతో చనిపోతున్నారని తెలిపారు. ఇప్పటివరకూ అనేక ఆందోళనలు చేసినా అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అగ్రి గోల్డు సంస్థకు ఆర్థిక ఇబ్బందులు లేవన్నారు. ప్రభుత్వమే డబ్బు చెల్లించేటట్లు చేస్తే కాలయాపన అవుతుందన్నారు. ప్రస్తుతం తమకు ఎక్కడా పనిదొరకడం లేదని, ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇటీవల పార్వతీపురం వచ్చిన సీఎం చంద్రబాబుకు విన తిపత్రం ఇచ్చినా ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదన్నారు.
వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం వచ్చినపుడు వినతిపత్రం ఇచ్చామని, పార్టీ పరంగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు మాట్లాడుతూ పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఏజెంట్లు, ఖాతాదారులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పోరాటం చేసి ప్రభుత్వం దృష్టిలో పడడం, ముఖ్యమంత్రిని ఎప్పటికప్పుడు కలవడం వంటివి చేయాలని సూచించారు.
అండగా ఉండి ఆదుకోండి...
Published Tue, May 19 2015 2:55 AM | Last Updated on Sat, Aug 11 2018 9:14 PM
Advertisement