ఉక్కిరి బిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలు
మహబూబ్‌నగర్‌లో 43, తిరుమలలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, విశాఖపట్నం/తిరుమల: ఎండాకాలం ఆరంభంలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రాన్ని భగభగ మండిస్తున్నాడు. వారం రోజులుగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతకు తోడు అధిక పీడనం, గాలిలో తేమ శాతం పెరుగుదల కారణంగా తీవ్ర ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం కూడా ఉష్ణోగ్రతలు అటూఇటుగా అలానే ఉన్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే సుమారు 4 డిగ్రీలు ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం నిపుణులు తెలిపారు. చాలాచోట్ల వడగాలులు కూడా వీస్తున్నాయని, రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. తిరుమలలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా నమోదైంది.
గత ఐదేళ్లుగా ఏప్రిల్ నెలలో 30 నుంచి 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, ఈసారి మాత్రం ఏప్రిల్ మొదటి రోజే 35 డిగ్రీలకు చేరింది. మంగళవారం వేంకటేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో ఎండతీవ్రత ప్రభావంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు భక్తులు సందడి బాగా తగ్గిపోయింది. వారు ఉపశమనం పొందేందుకు ఆలయం నాలుగు మాడవీధుల్లో టీటీడీ అధికారులు చలువ పందిళ్లు, కూల్ పెయింటింగ్, ఎర్రతివాచీ ఏర్పాటు చేశారు. వచ్చే రెండు నెలల్లో తిరుమలలో ఉష్ణోగ్రత బాగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ ల్యాబ్ సీనియర్ పరిశోధకుడు శ్రీనివాస దీక్షితులు ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మంగళవారం నాటి ఉష్ణోగ్రతలు (సెల్సియస్ డిగ్రీల్లో)
రెంటచింతల 41.9
తిరుపతి 41.7
నందిగామ 40.5
నెల్లూరు 40.5
విశాఖ 40.4
కావలి 40.4
తుని 40.2
ఒంగోలు 39.3
గన్నవరం 38.5
మచిలీపట్నం 37.4
కాకినాడ 36.2
బాపట్ల 36.4