స్మార్ట్‌కు సపోర్ట్
టాటా ట్రస్టు సహకారం సద్వినియోగం చేసుకోండి
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
విజయవాడ పార్లమెంట్
నియోజకవర్గ అభివృద్ధిపై ఒప్పందం
విజయవాడ : ఆధునిక టెక్నాలజీతో పాటు టాటా ట్రస్టు అందిస్తున్న సహకారాన్ని ఉపయోగించుకుని ప్రతి గ్రామాన్ని, వార్డును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పంచాయతీలకు అభివృద్ధి వివరాలను తెలియపరిచేందుకు గ్రామ కార్యదర్శులకు ట్యాబ్‌లు ఇస్తామని చెప్పారు. ఎనికేపాడులో 24 కే కన్వెన్షన్ సెంటర్‌లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని 264 గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టాటా ట్రస్టుతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామాణాభివృద్ధి అదనపు కార్యదర్శి శాంతిప్రియ పాండె, టాటా ట్రస్టు సీఈవో ఆర్.వెంకట్ రామన్ అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్మార్ట్ విలేజ్‌లు, వార్డుల అభివృద్ధికి టాటా ట్రస్టు సహకారం తీసుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు స్మార్ట్‌గా ఆలోచించి గ్రామాలను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం గ్రామాల నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడిన వారి సహాయం తీసుకోవాలని సూచించారు.
కేశినేని నానిని ఆదర్శంగా తీసుకోండి...
ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) చొరవ చూపించి టాటా ట్రస్టు చైర్మన్ రతన్‌టాటాతో సంప్రదింపులు చేసి నియోజకవర్గంలోని గ్రామాలను దత్తత తీసుకునేందుకు కృషి చే శారని, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. రతన్‌టాటా దేశం గర్వించదగిన వ్యక్తని, ఇతర దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు దీటుగా టాటా గ్రూపును అభివృద్ధి చేశారని తెలిపారు. నానో టెక్నాలజీని మన దేశం కూడా చేయగలదని నిరూపించారని కొనియాడారు.
చంద్రబాబుతో ఎంతోకాలంగా అనుబంధం...
చంద్రబాబుతో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని రతన్‌టాటా అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే చొరవ ముఖ్యమంత్రికి ఉందన్నారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ టాటా ట్రస్టు వెదురు పెంపకం, మత్స్య, పౌష్టికాహారం, గ్రామాల అభివృద్ధి సూక్ష ప్రణాళిక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. విజయవాడ బాంబూ (వెదురు) మిషన్ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి, రతన్‌టాటాలు సంయుక్తంగా ప్రారంభించారు. వెదురు మిషన్ అమలుకు కృషి చేసిన ఆదర్శరైతు సీతారాం ప్రసాద్, డీఎఫ్‌వో అశోక్‌కుమార్‌లను సీఎం అభినందించారు. రతన్‌టాటా, చంద్రబాబులపై కేశినేని నాని కుమార్తెలు శ్వేత, హేమలు రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, శాసనసభ్యులు జలీల్‌ఖాన్, రక్షణనిధి, శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టక్కర్, కలెక్టర్ బాబు.ఎ తదితరులు పాల్గొన్నారు.
బిజీబిజీగా రతన్‌టాటా...
టాటా ట్రస్టు చైర్మన్ రతన్‌టాటా విజయవాడలో ఒకరోజు పర్యటన బిజీబిజీగా గడిపారు. సీఎం చంద్రబాబుతో రతన్‌టాటా, ఎంపీ కేశినేని నాని సమావేశం నిర్వహించి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం 24 కే కన్వెన్షన్ హాలులో జరిగిన జరిగిన సమావేశంలో పాల్గొని విజయవాడ పార్లమెంట్ అభివృద్ధిపై అంగీకారం కుదుర్చుకున్నారు.