ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఏమంటారు?
తెలంగాణ సర్కారు అభ్యర్థనపై మీ అభిప్రాయమేంటి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏఐసీటీఈలకు సుప్రీం కోర్టు ప్రశ్న
విచారణ ఆగస్టు 4కు వాయిదా
సాక్షి, న్యూఢిలీ: ఎంసెట్ కౌన్సెలింగ్ గడువు పొడిగిం చాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసుకున్న అభ్యర్థనపై అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)ని కూడా వైఖరి వెల్లడించాలని సూచించింది. ఎంసెట్ కౌన్సెలింగ్ ఏఐసీటీఈ నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం జూలై 31వతేదీ లోగా పూర్తి కావాలి. అయితే తమది కొత్త రాష్ట్రం కావటం, తగిన యంత్రాంగం లేనందున కౌన్సెలింగ్ గడువును అక్టోబరు 31 వరకు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం జూలై 16న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ సుధాంశుజ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఏపీ ప్రభుత్వం, ఏఐసీటీఈలను ఇంప్లీడ్ చేసి పిటిషన్ కాపీలను అందచేయాలని ఆదేశించింది. సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా వైఖరి చెప్పాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది గంగూలీని ధర్మాసనం ఆదేశించింది. విద్యార్థు లు నష్టపోతారని, ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా వేయొద్దని అభ్యర్థించడంతో అఫిడవిట్ దాఖలుకు ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.
అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ సర్కారు
ఈ కేసు విచారణ వాయిదా పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది అఫిడవిట్‌ను సుప్రీం కోర్టుకు సమర్పించారు. సమయం సరిపోకపోవటం తో విచారణ వేళలో అందచేయలేదు. తక్షణం కౌన్సెలింగ్‌కు ఆదేశించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని అఫిడవిట్‌లో కోరారు. ‘కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన షెడ్యూల్ మేరకు కౌన్సెలింగ్ నిర్వహణకు మేం సిద్ధం. షెడ్యూలు ప్రకారం అడ్మిషన్లు జరపని పక్షంలో విద్యార్థులు నష్టపోవడమే కాకుండా సాంకేతిక విద్యావిధానం దెబ్బతింటుందని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠతకు గురవుతున్నారు. అందువల్ల తక్షణం కౌన్సెలింగ్ ప్ర క్రియ చేపట్టాలి.’ అని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ ఈ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.