
కార్యక్రమంలో మాట్లాడుతున్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్
గుంటూరు: నేటి విద్యా విధానంలో స్వల్ప లోపాలున్నాయని సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. ప్రస్తుతం పిల్లలను పోటీ పరీక్షలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామేగాని, సమాజంలో బతకడం, సమస్యలను సమర్థంగా ఎదుర్కొనగలిగే శక్తిని అందించేలా తయారు చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై పోరాడే శక్తిని విద్యార్థికి అందించేలా విద్యావిధానం మరింత వృద్ధి చెందాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్‌లో మంగళవారం డాక్టర్ రామినేని ఫౌండేషన్ (యూఎస్‌ఏ) ఆధ్వర్యంలో 2016–17 విద్యా సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామినేని ఫౌండేషన్ అధ్యక్షుడు ధర్మప్రచారక్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతి«థిగా విచ్చేసిన జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి రామినేని ఫౌండేషన్ అందిస్తున్న సేవలను కొనియాడారు.
రామినేని వారసులు తల్లిదండ్రులను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలతో వారిని సమాజంలో చిరస్థాయిగా నిలబెడుతున్నారని అభినందించారు. 138 మంది ప్రధానోపాధ్యాయులకు, 231 మంది ఉపాధ్యాయులకు కార్యక్రమంలో జస్టిస్ చలమేశ్వర్ చేతుల మీదుగా గురు పురస్కారాలు, విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.