నీతిమాలిన రాజకీయాలను సహించం
- మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి
- సురేష్ కుటుంబసభ్యులకు పరామర్శ
కోడూరు, న్యూస్‌లైన్ : అధికారం చేతికొచ్చిందని నీతిమాలిన రాజకీయాలకు పాల్పడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. మండలంలోని వి.కొత్తపాలెంలో టీడీపీ నాయకులు జరిపిన బాంబు దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త రేపల్లె సురేష్ మృతిచెందిన విషయం విదితమే. సురేష్ కుటుంబసభ్యులను పార్థసారథి ఆదివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా సారథి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడి, హత్యా రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడినా, అక్రమ కేసులు బనాయించి వేధించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిస్తే విజయోత్సవాలు చేసుకోవచ్చని, ఇతర పార్టీ నాయకులపై దాడులకు తెగబడి హత్య చేయడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ నాయకులు విజయోత్సవాల పేరుతో దివిసీమలో చాలా ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులు చేశారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు తమ వైఖరి మార్చు కోవాలని హితవుపలికారు.
కుటుంబానికి అండగా ఉంటాం
సురేష్ కుటుంబానికి అండగా ఉంటామని సారథి, రమేష్ హామీ ఇచ్చారు. సురేష్ తండ్రి బసవకుటుంబరావును అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అవనిగడ్డ, వి.కొత్తపాలెం సర్పంచులు నలంకుర్తి పృథ్వీరాజ్, యలవర్తి నాంచారయ్య, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుడివాక శివరావు, కడవకొల్లు నరసింహారావు, పార్టీ మండల కన్వీనర్ పరిశె మాధవరావు, రాధా-రంగా మిత్రమండలి దివియూనిట్ అధ్యక్షుడు రాజనాల మణిక్యాలరావు, మిల్క్‌సొసైటీ అధ్యక్షుడు రేపల్లి చంద్రశేఖర్, తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.
కొనసాగుతున్న పోలీస్ పికెట్లు
శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని వి.కొత్తపాలెంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన పోలీసు పికెట్లు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ జి.వి.సత్యనారాయణమూర్తి తెలి పారు. రేపల్లె సురేష్ హత్య కేసులో నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారని, వారి కోసం పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయని వివరించారు.