సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అధికారులు, సిబ్బంది హాజరు, సమయ పాలనపై దృష్టి సారించిన కలెక్టర్ స్మితాసబర్వాల్ మరో అడుగు ముందుకు వేశారు. జిల్లా కేంద్రంలోనే అధికారులు నివసిస్తున్నారా లేదా అనే అంశంపై సోమవారం రహస్యంగా ఆరాతీశారు. రెవెన్యూ విభాగానికి చెందిన ముగ్గురు మండల స్థాయి అధికారులకు కలెక్టర్ గూఢచర్య బాధ్యతలు అప్పగించారు. అధికారులు తాము అందజేసిన చిరునామాలో ఉన్నారా లేదా అనే అంశంపై మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ బృందం స్వయంగా తనిఖీలు నిర్వహించింది. తనిఖీలో వెల్లడైన వివరాలతో కూడిన నివేదికను మంగళవారం కలెక్టర్‌కు సమర్పించింది. సుమారు 70 మంది ప్రభుత్వ అధికారులకు గాను, 25 మంది స్థానిక నివాసాలకు సంబంధించిన చిరునామా, ఫోన్ నంబర్లు కూడా ఇవ్వలేదు.
వీరికి నోటీసులు జారీ చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వీరితో పాటు స్థానికంగా ఉండని అధికారులపై నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ సమాయత్తమవుతున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ శాఖల అధికారులు జిల్లా కేంద్రంలోనే ఉండాలంటూ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా చాలా మంది అధికారులు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్న సమాచారంతో కలెక్టర్ రహస్యంగా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉండని అధికారులపై కలెక్టర్ ఆరా తీసిన నేపథ్యంలో కొందరు అధికారులు ఆగమేఘాల మీద అద్దె ఇళ్లు వెతుక్కునే పనిలో పడ్డారు.
అధికారులపై నిఘా!
Published Wed, Dec 4 2013 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
Advertisement
Advertisement