
టి. బిల్లు విమానంలో కాకుండా ఎడ్లబండిలో తీసుకు వస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు తెలంగాణ బిల్లును యుద్ద విమానంలో తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం తెలుగువారిపై యుద్దం చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు శుక్రవారం హైదరాబాద్లో తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ బిల్లును విమానంలో కాకపోతే ఎడ్లబండిలో తీసుకువస్తారా అంటూ చంద్రబాబును హరీష్ రావు ప్రశ్నించారు.
మామ ఎన్టీఆర్కు వెన్ను పోటు పొడిచినప్పుడు అసెంబ్లీ స్పీకరుని తుని నుంచి హెలికాఫ్టర్లో తీసుకురాలేదా లేకుంటే ఆ సంగతి మరిచిపోయావా అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు. చంద్రబాబుకు ఓ విధానం అంటూ లేదని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ పార్టీ సమైక్యాంధ్ర అంటే చంద్రబాబు కూడా సమైక్యాంధ్ర అంటూ వారిని కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పార్టీ తోక పార్టీటా మారిందని వ్యాఖ్యానించారు.