జేసీ... ఏంటి నీ పేచీ!
►దాడి కేసులో పైలా నరసింహయ్య లొంగుబాటు
► మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు రిఫర్
► నిమ్స్‌కు పంపకుండా సూపరింటెండెంట్‌పై జేసీ ప్రభాకర్ ఒత్తిడి
► తనకు ప్రాణహాని ఉందంటూ ఆర్‌ఎంఓ ఎదుట పైలా కన్నీరు
అనంతపురం: అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి వైద్యాధికారులు కూడా తలూపడం విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. పైలా నరసింహయ్య తాడిపత్రిలో కీలక నేత. ముందు నుంచి జేసీ సోదరులకు, పైలాకు మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత నెల 15న జేసీ వర్గీయుడైన ఓ వ్యక్తిపై పైలా దాడి చేసినట్లు తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 21న పైలా లొంగిపోయారు.
అప్పటికే అనారోగ్యంగా ఉండడంతో కోర్టు ఆదేశాల మేరకు తాడిపత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సౌకర్యాలు లేవని 22న అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. గుండె స్పందన సరిగా లేకపోవడంతోపాటు అపెండిసైటిస్‌కు సంబంధించి తీవ్ర లక్షణాలున్నాయని డాక్టర్ మహేష్ ధ్రువీకరించారు. దీంతో గురువారం ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని రాసిచ్చారు. ఓ పోలీస్ ఉన్నతాధికారి ద్వారా విషయం తెలుసుకున్న ప్రభాకర్ వెంటనే సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌కు ఫోన్ చేసి నిమ్స్‌కు పంపొద్దని ఒత్తిడి చేశారు. దీంతో పైలాను నిమ్స్‌కు తరలించొద్దని సూపరింటెండెంట్ ఆదేశాలిచ్చారు. ఈ విషయం తెలియగానే పైలా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఆర్‌ఎంఓ ఎదుట పైలా కన్నీరు
ఆస్పత్రి అధికారుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన పైలా నరసింహయ్య మధ్యాహ్నం నుంచి ఆహారం తీసుకోలేదు. సాయంత్రం ఐదు గంటలకు ఆర్‌ఎంఓ లలిత, డిప్యూటీ ఆర్‌ఎంఓలు డాక్టర్ విజయమ్మ, జమాల్‌బాషాలు పైలాతో మాట్లాడారు. తనకు అనారోగ్యంగా ఉన్నా ఎందుకు పంపించడం లేదని ప్రశ్నిస్తూ ఆయన కన్నీరుమున్నీరయ్యారు. పక్కా ప్లాన్‌తోనే ఇలా చేస్తున్నారని, తనకు జేసీ ప్రభాకర్‌రెడ్డితో ప్రాణహాని ఉందని ఆరోపించారు. అయితే రిఫర్ చేసిన లెటర్ ఉన్నా కూడా నిమ్స్‌కు ఆయనను రిఫర్ చేయలేదని సూపరింటెండెంట్ జగన్నాథ్ చెప్పడం గమనార్హం.