తప్పిన పెనుముప్పు | tanker lorry Roll over in srikakulam | Sakshi
Sakshi News home page

తప్పిన పెనుముప్పు

Published Fri, Feb 7 2014 1:19 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

tanker lorry Roll over in srikakulam

పొందూరు, న్యూస్‌లైన్: సాయంత్రం ఆరుగంటలు... పాలకొండ పారిస్ సుగర్ ఫ్యాక్టరీకి చెందిన ట్యాంకర్ లారీ స్పిరిట్‌తో రాజాం మీదుగా చిలకపాలెం వైపు వస్తూ లోలుగు సమీపానికి చేరుకుంది. ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించేందుకు డ్రైవర్ బ్రేక్ వేసినా ఫలితం లేదు... ప్రమాదం తప్పదని గమనించినా ఏమీ చేయలేని నిస్సహాయత... వెంటనే తోటి క్లీనర్‌ను కిందకు తోసేశాడు... ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే ప్రయత్నంలోనే ఓ లారీను, దానివెనుకనే వస్తున్న ఆటోను, కారును ఢీకొట్టాడు. దీంతో ట్యాంకర్ లారీ కూడా బోల్తా పడడంతో పది వేల లీటర్ల స్పిరిట్‌తో పరిసరాలు నిండిపోయాయి. అందరూ భయంతో పరుగులు తీశారు. కాసేపటికే తేరుకున్న లోలుగు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్ క్యాబిన్‌లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్న కరీంనగర్‌కు చెందిన డ్రైవర్ ఎస్.కె.ఫిరోజ్‌ఖాన్‌ను రక్షించారు. ఆయనతో పాటు గాయపడిన మరో ముగ్గురిని 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. విశాఖపట్నంలోని ఓ ఫ్యాక్టరీకి స్పిరిట్ తీసుకెళ్తున్న ట్యాంకర్ లారీ పొందూరు-చిలకపాలెం ప్రధాన రోడ్డుకు అడ్డంగా బోల్తా పడడంతోరాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.  
 
 సాహసించిన లోలుగు గ్రామస్తులు 
 ఓ వైపు స్పిరిట్‌తో నిండిన పరిసరాలు... మరో వైపు ట్యాంకర్ లారీ క్యాబిన్‌లో చిక్కుకుని రక్షించండంటూ డ్రైవర్ ఆర్తనాదాలు... ప్రమాదం పొంచి ఉన్నా...లోలుగు గ్రామస్తులు సాహసించారు. కొందరు యువకులు పరుగున వెళ్లి డ్రైవర్‌ను రక్షించేందుకు ప్రయత్నించారు. గునపాలు, తాళ్ల సహాయంతో క్యాబిన్‌ను తొలగించారు. చివరకు జేసీబీను తెప్పించి డ్రైవర్‌ను ప్రమాదం నుంచి రక్షించారు. 
 
 తప్పిన పెను ప్రమాదం 
 స్పిరిట్ పడే ప్రాంతంలో ఏ మాత్రం నిప్పు రవ్వలు రగిలినా పెను ప్రమా దం జరిగేది. స్పిరిట్‌కు నిప్పంటుకుంటే పదుల సంఖ్యలో మృతిచెందేవారు. పొందూరు అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో చేరుకుని పరిసరాలను నీటితో తడిపారు. అగ్నిప్రమాదానికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నారు. అయితే, డ్రైవర్‌ను రక్షించే సమయంలో ఓ వ్యక్తి సిగెరెట్ తాగుతూ ట్యాంకర్ దగ్గర రావడంతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ట్యాంకర్ దగ్గర ఉన్న పోలీసులు, స్థానికులు ఆ వ్యక్తిని దూరంగా నెట్టేశారు. అదే సిగరెట్ పొరపాటున స్పిరిట్‌కు అంటుకొని ఉంటే ట్యాంకర్ పేలిపోయి పెనుప్రవూదం సంభవించేది. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
 
 తెగిన విద్యుత్ వైర్లు 
 ట్యాంకర్ విద్యుత్ స్తంభాన్ని సైతం భూమిలో నుంచి లాగేయండంతో వైర్తు తెగిపోయి రోడ్డుమీద పడిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
 
 నువ్వైనా బతుకు...
 బ్రేక్ ఫెయిల్ కావడంతో అడ్డదిడ్డంగా ప్రయాణిస్తున్న ట్యాంకర్ లారీ, ఆటోను ఢీకొట్టబోతుందని తెలిసిన డ్రైవర్ ఎంతో ఉదారంగా వ్యవహిరించాడు. లారీని కొన్ని సెకన్లతో ఢీకొడుతుందనే సమయానికి నువ్వైనా బతుకురా అంటూ క్లీనర్ కృష్ణను డ్రైవర్ ఫిరోజ్‌ఖాన్ బయటకు తోసేశాడని స్థానికులు చెబుతున్నారు. తన ప్రాణాలు పోతాయని తెలిసినా తన క్లీనర్‌ను రక్షించుకోవడం ఎంతో గొప్ప విషయం. బయటకు నెట్టేయడంతో క్లీనర్ చిన్నచిన్న గాయాలతో బయటపడ్డాడు. పొందూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో ట్యాంకర్‌ను రోడ్డు పక్కకు మళ్లించారు. కేసు నమోదుచేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement