సీఎం దీక్షలో మహిళ గెంటివేత | TDP Activists over action at Chandrababu deeksha | Sakshi
Sakshi News home page

సీఎం దీక్షలో మహిళ గెంటివేత

Published Sun, Dec 23 2018 3:30 AM | Last Updated on Sun, Dec 23 2018 3:30 AM

TDP Activists over action at Chandrababu deeksha - Sakshi

ట్రైనీ ఎస్సై చేయిపట్టుకొని బతిమిలాడుతున్న పోలమ్మ

శ్రీకాకుళం రూరల్‌: శ్రీకాకుళంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో కష్టం చెప్పుకోవాలని వచ్చిన ఓ మహిళను పోలీసులు మెడపట్టుకుని బయటకు గెంటేశారు. రెండున్నరేళ్ల కిందట ఇల్లు కాలిపోయిన తనకు ఇంతవరకు న్యాయం జరగలేదని ముఖ్యమంత్రికి విన్నవించుకోవాలని వచ్చిన పోలమ్మ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. సీఎం గారూ.. నా  ఇల్లు కాలిపోయింది.. నాకు న్యాయం చేయండి.. అంటూ గట్టిగా కేకలు వేసిన ఆమెను అక్కడే విధుల్లో ఉన్న మహిళా ట్రైనీ ఎస్సై డి.శ్యామల (సీతంపేట పీఎస్‌) మెడపట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చారు. అమ్మా నేను తీవ్రవాదిను కాదు.. నేనో సాధారణ మహిళను.. నన్ను సీఎం వద్దకు తీసుకెళ్లాలంటూ బతిమిలాడినా జుట్టుపట్టుకుని లాక్కొచ్చేశారు. ఆమె చేతుల్లోని కాగితాలను లాక్కున్నారు.

ఇంతలో ఓ వ్యక్తి అడ్డుపడి సీఎం డౌన్‌డౌన్‌.. అంటూ నినాదాలు చేశాడు. అతడిపై టీడీపీ కార్యకర్తలు దాడిచేసి పిడుగుద్దులు గుద్దారు. ఇది గమనించి ఫొటోలు తీసిన విలేకరులను కూడా హెచ్చరించేలా ట్రైనీ ఎస్సై మాట్లాడారు. అనంతరం పోలమ్మ విలేకరుల వద్ద తన కష్టాన్ని వివరిస్తూ కన్నీటిపర్యంతమైంది. ఆమె తెలిపిన మేరకు.. పొందూరు మండలం బొడ్డేపల్లిలో ఆమె ఇల్లు 2016 ఏప్రిల్‌లో విద్యుత్‌ షార్ట్‌షర్క్యూట్‌తో కాలిపోయింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు, ఎంపీకి, మంత్రికి పలుమార్లు వినతిపత్రాలు అందించినా న్యాయం జరగలేదు. గతంలో జరిగిన గ్రామదర్శినిలో ఆమె ఇంటికి రూ.2.7 లక్షలు ఇస్తామని ఎమ్మెల్యే రవికుమార్‌ టీడీపీ నాయకులతో చెప్పారు. తరువాత ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు. కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఇచ్చిన అర్జీని కూడా ఎవరూ పట్టించుకోలేదు. కుమార్తె పెళ్లికోసం చేసిన అప్పులు తీర్చేమార్గం కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జిల్లాకు రావడంతో తన కష్టాన్ని చెప్పుకోవాలని వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement