తెలుగు దళారుల పార్టీ టీడీపీ: కేటీఆర్
సిరిసిల్ల: తెలుగుదేశం పార్టీని తెలుగు దళారుల పార్టీగా సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అభివర్ణించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అంశంపై తమ రెండు పార్టీల మధ్య ఏనాడూ ఒప్పందం కుదరలేదని, టీడీపీ నేతలు కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
టీఆర్‌ఎస్ విలీనంపై వారెందుకు తహతహలాడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమైతేనే తెలంగాణ ఏర్పాటవుతుందని టీడీపీ నేతలు అంటున్నారని, వారికేమైనా లాభమైతే కాంగ్రెస్‌లో చేరాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతంలో టీడీపీ మట్టికొట్టుకొని పోతుందన్న భయంతోనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.