
ముసుగు తీసేశారు..!
* వైఎస్సార్‌సీపీకి చైర్మన్‌గిరీ దక్కకుండా గిరిగీసుకున్న అధికారులు
* ఎన్నికల కమిషన్ ఆదే శాలు తుంగలోకి..
* ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై టీడీపీ దాడి
* ఈసీ పరిధిలోకి జమ్మలమడుగు వ్యవహారం
సాక్షి ప్రతినిధి, కడప: ప్రభుత్వ అధికారులనే ముసుగు తొలగించారు. పచ్చ కండువా కప్పుకోకుండానే అధికార పార్టీ మత్తులో జోగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చైర్మన్‌గిరీ చేజారిపోకుండా రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం లోపల టీడీపీ కౌన్సిలర్లు, వెలుపుల తెలుగుతమ్ముళ్లు యథేచ్ఛగా వీరంగం సృష్టించారు. పోలీసుల్ని సైతం లెక్కచేయకుండా దాడులకు తెగబడ్డారు. నిబంధనల మేరకు చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ ఆదేశించినా, అప్పటి వరకూ బేషుగ్గా ఉన్న ప్రిసైడింగ్ అధికారికి రఘునాథరెడ్డికి అనారోగ్య సమస్య తెరపైకి వచ్చింది. ఈలోగా శాంతిభద్రతలు అదుపు తప్పనున్నాయని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ లేఖ రాశారు. వైఎస్సార్ జిల్లాలో జమ్మలమడుగులో అధికార యంత్రాంగం ఏకపక్ష ధోరణిలో పయనిస్తోంది. గురువారం కౌన్సిలర్ కిడ్నాప్ డ్రామాను తెరకెక్కించిన టీడీపీ నేతలు, శుక్రవారం అధికారుల అండతో శాంతిభద్రతల సమస్యను తెరకెక్కించారు.
నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు: జమ్మలమడుగు 1వవార్డు కౌన్సిలర్ మహమ్మద్‌జానీ తననెవ్వరూ కిడ్నాప్ చేయలేదంటూ గురువారం సాయంత్రమే ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీవో రఘునాథరెడ్డికి స్వయంగా ఫోన్ చేశారు. శుక్రవారం ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం మాట్లాడారు. రాజకీయాలపై విరక్తితో వచ్చానని, ఆరోగ్యం బాగా లేకపోతే చూపించుకునేందుకు వెళ్లానని తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, పోలీసు అధికారులు సైతం సంప్రదించలేదని వివరించారు. ఆమేరకు స్పందించిన ఎన్నికల సంఘం 22మంది సభ్యులకు గాను, 21మంది హాజరైన నేపథ్యంలో జమ్మలమడుగు చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతోందనుకున్న తరుణంలో ఆర్డీఓ రఘునాథరెడ్డి కర్ఛీఫ్‌తో ముఖం తుడుచుకుంటూ ప్రస్తుతం ఆరోగ్యం సహకరించడం లేదని ఎన్నికలు నిర్వహించలేనని మొండికేశారు. రెండు గంటలు కథ నడించారు. ఆలోగా శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని చైర్మన్ ఎన్నికల్ని వాయిదా వేయాలంటూ జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఆర్డీవోకు లేఖ పంపారు. అంతవరకూ అనారోగ్యం నటించిన ఆర్డీవో ఆలేఖను హుషారుగా చదివి సభ్యులకు వినిపించారు. అధికారుల వైఖరిని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ దృష్టికి తీసుకెళ్లారు. 21 మంది సభ్యుల మధ్య చైర్మన్ ఎన్నికలు నిర్వహించలేరా? అని ఆయన విస్మయం ప్రకటించినట్లు సమాచారం.
టీడీపీ దౌర్జన్యం
తెలుగుదేశం పార్టీ నేతలు జమ్మలమడుగులో రెండురోజులు యథేచ్ఛగా దౌర్జన్యం కొనసాగించారు. పోలీసుల్ని సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ వందలాదిగా కార్యకర్తలతో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి హల్‌చల్ చేశారు. చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుసుకోగానే టీడీపీ కౌన్సిలర్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై కారంపొడి చల్లారు. అంటే కౌన్సిలర్లను పోలీసులు ఏమేరకు తనిఖీలు చేశారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జమ్మలమడుగు పురవీధుల్లో తెలుగుదేశం కార్యకర్తలు వీరంగం సృష్టించారు. యధేచ్ఛగా రాళ్ల వర్షం కురింపిం చారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమౌతుందని ఎస్పీ లేఖను ఎన్నికల సంఘం దృష్టికి జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తీసుకెళ్లారు.