రెండో పెళ్లికి యత్నం; టీడీపీ నేతలే పెద్దలు | TDP Ex MLA Pilli Anantha Lakshmi Son Second Marriage Stop in East Godavari | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే తనయుడికి రెండో వివాహ యత్నం

Published Fri, Jun 12 2020 11:44 AM | Last Updated on Fri, Jun 12 2020 9:35 PM

TDP Ex MLA Pilli Anantha Lakshmi Son Second Marriage Stop in East Godavari - Sakshi

తెలుగుదేశం పార్టీ ప్రముఖులే పెళ్లి పెద్దలుగా కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడికి రెండో వివాహం చేసేందుకు జరిగిన యత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. 

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం : తెలుగుదేశం పార్టీ ప్రముఖులే పెళ్లి పెద్దలుగా ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి రెండో వివాహం చేసేందుకు జరిగిన యత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడి స్వగ్రామం తొండంగి మండలం ఏవీ నగరం ఈ వ్యవహారానికి వేదిక అయ్యింది. పోలీసులు, స్థానికులు, బాధితుల కథనం ప్రకారం..

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతుల కుమారుడు రాధాకృష్ణకు బుధవారం అర్ధరాత్రి రెండో వివాహం చేసేందుకు యత్నించారు. దీనికి మాజీమంత్రులు యనమల, చినరాజప్ప తదితర టీడీపీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, రాధాకృష్ణ ఇదివరకే తనను పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలు పుట్టాక తనను మోసంచేసి, ఇప్పుడు రెండో వివాహం చేసుకుంటున్నాడని సామర్లకోట మండలం మాధవపట్నానికి చెందిన పిల్లి మంజుప్రియ బుధవారం కాకినాడ ‘దిశ’ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

జారుకున్న యనమల, చినరాజప్ప
ఇదిలా ఉంటే.. పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలియడంతో యనమల, చినరాజప్ప, ఇతర టీడీపీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. తాము వెళ్లేసరికి కల్యాణ వేదిక వద్ద పెళ్లి కుమారుడు, కుటుంబ సభ్యులు ఉన్నారని.. దీంతో వివాహాన్ని నిలిపివేశామని పోలీసులు తెలిపారు. కాగా, తనను వదిలించుకుని రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రాధాకృష్ణపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని మంజుప్రియ డిమాండ్‌ చేశారు. అతడికి కొంతమంది మాజీమంత్రుల మద్దతు ఉందని ఆరోపించారు. దీనిపై నిర్దిష్టంగా ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement