చెక్‌డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి లోకేష్ (ఫైల్)
రైతులు దేశానికి వెన్నెముక వంటి వారు.. అలాంటి వారికి ఉపయోగపడే ప్రాజెక్టులను కూడా రాజకీయ లబ్ధి కోసం శంకుస్థాపన చేయడం బాధాకరమని పశ్చిమ ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి పనులకు అట్టహాసంగా శంకుస్థాపనలు చేసి నిధులు మంజూరు చేయకపోవడాన్ని అన్నదాతలు తప్పుబడుతున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..అన్న చందంగా ఉంది మార్కాపురం గుండ్లకమ్మ నది ఒడ్డున ఏర్పాటు చేసిన చెక్‌డ్యామ్ పరిస్థితి. చెక్‌డ్యామ్ ఎట్టకేలకు పూర్తయినా నీళ్లు నిల్వ ఉండేందుకు గేట్లు నిర్మించకపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. వేలాది ఎకరాలు బీళ్లుగా మారుతున్నాయి. రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి.
సాక్షి, మార్కాపురం రూరల్ (ప్రకాశం): మార్కాపురం పట్టణ సమీపంలోని పెద్ద నాగులవరం గ్రామ ఇలాకాలో గుండ్లకమ్మపై నాలుగేళ్ల క్రితం రూ.9 కోట్లతో భారీ చెక్‌డ్యామ్ నిర్మించారు. మెకానికల్ గేట్లు అమర్చలేదు. చెక్‌డ్యామ్ నిర్మించినా ఉపయోగం లేకుండా కేవలం అలంకార ప్రాయంగా ఉంది. ఇటీవల ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా గుండ్లకమ్మకు నీరు చేరింది. చెక్‌డ్యామ్ నిండి కూడా గుండ్లకమ్మ నీరు దిగువ ప్రాంతానికి వెళ్లిపోయింది. ఆ చెక్ డ్యామ్‌కు గేట్లు నిర్మించకకోవడంతో నీరంతా దిగువ ప్రాంతానికి వృథాగా పోయింది. ప్రజలు ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. సాగు చేసి నాలుగు గింజలు పండిద్దామన్న రైతుల కల నెరవేరలేదు.
చెక్‌డ్యామ్ కెపాసిటీ దాదాపు 80 మిలియన్ క్యూబిక్ పీట్స్ అంటే 0.08 టీఎంసీల వరకు నీరు నిల్వ చేసుకోవచ్చు. అంటే దాదాపు 800 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలతో పాటు పట్టణంలోని బోర్లకు నీరు అందించవచ్చు. చెక్‌డ్యామ్‌తో పట్టణంలోని బోర్లకు భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు నీటి సమస్య ఉండదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చెక్‌డ్యామ్ చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి దాపురించింది. అరకొరగా చేపట్టిన చెక్‌డ్యామ్ నిర్మాణ పనులపై అప్పట్లో ప్రజలు ఇరిగేషన్ అధికారుల తీరును తప్పుపట్టారు. ఇటు ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి చెక్‌డ్యామ్‌ను సందర్శించి వెంటనే రింగ్ బండ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చెక్‌డ్యామ్ ఇరువైపులా ఉన్న మట్టి ఇప్పటికే జారిపోతోందని, పైన మట్టి నెర్రెలు బారిందని, ఇరువైపులా రివింట్‌మెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఏం..ఉపయోగం?
ఎట్టకేలకు రింగ్ బండను ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండాపోయింది. అది కాస్తా కొద్దిపాటి వర్షానికే కొట్టుకుపోయింది. కేవలం ప్రజాప్రతినిధులు ఏదో అడిగారు.. చేశామని చందంగా ఆ రింగ్ బండ్‌ను ఏర్పాటు చేశారు. రింగ్ బండ ఏర్పాటు చేసేటప్పుడు మట్టిపోసి దానిపై నీళ్లు చల్లి రోలింగ్ తిప్పాలి. కానీ అదేమీ చేయకుండా చెక్‌డ్యామ్‌లోని మట్టిని ట్రాక్టర్‌తో తెచ్చి గ్యాప్ పూడ్చారు.
రూ.66 లక్షలు అవసరం
పెద్దనాగులవరం చెక్‌డ్యామ్‌లో నీరు నిల్వ ఉండేందుకు సుమారు మూడు మెకానికల్ గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు రూ.66 లక్షలు అవసరం కానున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఉదాసీనతతో నిధులు కూడా మంజూరు కాలేదు. ఇటీవల మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు మంత్రి లోక్‌ష్ దరిమడుగు సమీపంలో కొత్త చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ.28.09 కోట్లతో శంకుస్థాపన చేశారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణ ముఖ్య ఉద్దేశం పట్టణంలోని బోర్లకు నీరు సంవృద్ధిగా అందించడం. సమీపంలోని పొలాలకు నీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడం తప్పు కాదుగానీ తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఐదు నెలలవుతున్నా ప్రారంభించని పనులు
నిర్మాణానికి రూ.28.09 కోట్లు మంజూరు చేశామని చినబాబు చెప్పారు. చెప్పి కూడా దాదాపు ఐదు నెలలు కావస్తున్నా ఇంత వరకు అతీగతీ లేదు. పనులు చేపట్టలేదు కదా అసలు టెండర్లే జరగలేదు. పట్టణ ప్రజలు, దరిమడుగు గ్రామ ప్రజలకు ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోసం హడావుడి కోసం శంకుస్థాపన చేసి ఎవరిని మోసం చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నదానికి ఉపయోగం లేకుండా కొత్త వాటి నిర్మాణానికి కోట్లు మంజూరు చేస్తారా..అంటూ ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ప్రజలను మోసం చేసేందుకే శంకుస్థాపనలు
ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి చంద్రబాబునాయుడు వచ్చారు. ఇక చినబాబు మార్కాపురం ప్రాంతంలో పలు రకాల పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో పెద్ద నాగులవరం చెక్‌డ్యామ్ పూర్తి అయినా దానికి మెకానికల్ గేట్‌లు ఏర్పాటుకు రూ.66 లక్షలు మంజూరు చేయాలి. ఇప్పటికీ దిక్కు లేదుగానీ కొత్తగా రూ.28 కోట్లతో మరొకదానికి దరిమడుగ గ్రామ సమీపంలో శంకుస్థాపన చినబాబు చేశారు. ఇది కేవలం ప్రజలను మోసం చేసేందుకే.
- జవ్వాజి వెంకట రంగారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు
రైతులతో రాజకీయం చేయడం సిగ్గుచేటు
గుండ్లకమ్మ నది ఒడ్డున పెద్ద నాగులవరం చెక్ డ్యామ్ పూర్తి చేసి కూడా రైతులకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. దానికి గేట్లు నిర్మిస్తే చుట్టుపక్కల రైతుల బోర్లకు నీరు పూర్తిగా వస్తుంది. మంత్రి లోకేష్ శంకుస్థాపనలు చేసిన విధానం చూస్తుంటే రాజకీయ లబ్ధి కోసమే శంకుస్థాపన చేసినట్లు ఉంది.
- సీహెచ్ తిరుపతిరెడ్డి, దరిమడుగు, రైతు
గేట్లు నిర్మించాలి
పెద్ద నాగులవరం చెక్ డ్యామ్ పూర్తయి దాదాపు 15 నెలలు కావస్తున్నా ఇంత వరకు గేట్లు నిర్మించకపోవడం సిగ్గుచేటు. గేట్లు పెట్టి ఉంటే ఆరు నెలల క్రితం గుండ్లకమ్మ నది ఎగువన కురిసిన వర్షానికి నీరు నిల్వ ఉండి ఉపయోగపడేవి. కానీ దిగువకు పోయి కేవలం ఆ చెక్‌డ్యామ్ అలంకార ప్రాయంగా మిగిలిపోయింది. చెక్‌డ్యామ్ విషయంలో రాజకీయం చేయకుండా త్వరగా గేట్లు నిర్మించాలి.
- తురకా ఏడుకొండలు, సీపీఎం నాయకుడు, పెద్ద నాగులవరం
Comments
Please login to add a commentAdd a comment