
గాయపడిన చిన్న నారాయణ
అనంతపురం, శింగనమల: మండలంలో ఇరువెందలలో మళ్లీ గ్రామకక్షలు పడగవిప్పాయి. వైఎస్సార్‌సీపీ మాజీ సర్పంచ్, సర్పంచ్‌ల సంఘం మాజీ మండలాధ్యక్షుడు గంగన్న, అతని అనుచరుడు చిన్న నారాయణపై టీడీపీ నాయకులు గొడ్డలితో దాడి చేశారు. బాధితులు, గ్రామస్తుల వివరాల మేరకు..వైఎస్సార్‌సీపీ మాజీ సర్పంచ్ గంగన్న, టీడీపీ నేత పెద్దనారాయణస్వామి ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి.
ఇద్దరికీ దారి విషయంలో వివాదం ఉంది. ఆరు నెలలుగా పోలీసులు పంచాయతీ చేస్తూనే ఉన్నా సమస్య తీరలేదు.గురువారం గంగన్న, అతని అనుచరుడు చిన్న నారాయణ నడుచుకుంటూ ఎస్సీ కాలనీ వైపు పోతుండగా పెద్దనారాయణస్వామి, వారి అనుచరులు గొడ్డలి, కట్టెలతో దాడి చేసేందుకు వచ్చారు. గంగన్న తప్పించుకోవడంతో చిన్న నారాయణపై దాడి చేశారు. ఈదాడిలో చిన్ననారాయణ తల, కాళ్లుకు బలమైన గాయాలు తగిలాయి. స్థానికులు వెంటనే అతడిని 108లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇటుకలపల్లి సీఐ పులయ్య, నార్పల ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఎలాంటి ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.